మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో 13మంది మృతి

మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో 13మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో 13 మంది  మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. వేగంగా వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

సింధ్‌ఖేడ్‌రాజా,మేహ్‌కర్‌ రోడ్డుపై దుసర్‌బిడ్‌ గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 16 మంది కూలీలు నాగ్‌పూర్‌,ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టు  పనులకు బయల్దేరారు. వాహనం వేగంగా ఉండటం.. రోడ్డుపై పెద్ద గుంత కారణంగా బోల్తా పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే కిన్‌గావ్‌ రాజా పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని జాల్నా జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరు సింధ్‌ఖేడ్‌రాజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కూలీల్లో చాలావరకు బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారని పోలీసులు తెలిపారు.