ఇక తెలుగులో జీవోలు.. ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో సీఎం రేవంత్

  • ఇప్పటికే రుణమాఫీ జీవోను మన భాషలోనే ఇచ్చినం
  • మాతృభాషను మరవొద్దు.. ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో సీఎం రేవంత్
  • అధికారిక కార్యక్రమాల్లో తెలుగుకే ప్రాధాన్యం
  • కోర్టు జడ్జిమెంట్లూ మన భాషలో ఉండాలి
  • ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టండి..సింగిల్ విండోలో అనుమతులిస్తం
  • ప్రపంచంతో తెలంగాణ, ఏపీ పోటీ పడాలి
  • రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం
  • దేశ రాజకీయాల్లో తెలుగువాళ్లుప్రభావం చూపాలని పిలుపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాల్లో తెలుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. జీవోలు కూడా తెలుగులో ఇచ్చేలా దశలవారీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే రుణమాఫీ జీవోను తెలుగులో ఇప్పించామని ఆయన గుర్తుచేశారు. రాజకీయం, సినీ, వాణిజ్యం.. ఇట్ల ఏ రంగంలో ఎంతస్థాయిలో రాణించినప్పటికీ మన భాషను మరిచిపోవద్దని సూచించారు. ఆదివారం హెచ్​ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టు జడ్జిమెంట్లు కూడా తెలుగులో ఉండాలని, అప్పుడే మనవాళ్లకు తీర్పులు సులువుగా అర్థమవుతాయని చెప్పారు.  కోర్టులు కూడా తెలుగును అనుకరించాలన్నారు. పెద్ద బాలశిక్షలో మార్పులు చేయాలని విద్యా కమిషన్​కు ఆదేశాలు ఇస్తానని, అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగు మాట్లాడేవాళ్లు 18 కోట్ల మందికిపైగా ఉన్నారని.. దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగే అని గుర్తుచేశారు. 

దేశ రాజకీయాల్లో మన పాత్ర ఉండాలి
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లు ఉన్నారని.. నిరుడు అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి సిలికాన్ వ్యాలీతో పాటు పలు ప్రాంతాల్లో తెలుగు వాళ్లను చూసినప్పుడు ఎంతో సంతోషం కలిగిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మన తెలుగు సినిమా హాలీవుడ్ తో పోటీ పడేలా రాణిస్తున్నదని అభినందించారు.  “దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడేది తెలుగు భాషనే. కానీ.. దేశ రాజకీయాలమీద గతంలో మాదిరిగా తెలుగువాళ్లం  ప్రభావం చూపించలేకపోతున్నాం. నీలం సంజీవ రెడ్డి, పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్, జైపాల్ రెడ్డి, కాకా వెంకటస్వామి, వెంకయ్య నాయుడు దేశరాజకీయాల్లో ఎంతో ప్రభావం చూపించారు. రెండు మూడు తరాల తర్వాత ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తెలుగువాళ్ల ప్రభావం తగ్గింది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దేశ రాజకీయాల్లో మన పాత్ర ఉండాలి ” అని పిలుపునిచ్చారు. మన భాష ఉనికిని, మనుగడను, మన సంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

ఫోర్త్​ సిటీలో పెట్టుబడులు పెట్టండి
ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని తెలుగు పారిశ్రామిక వేత్తలను సీఎం రేవంత్​రెడ్డి ఆహ్వానించారు. ‘‘రాష్ట్ర  అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం కావాలి. హైదరాబాద్, సైబరాబాద్ తరహాలో 30 వేల ఎకరాల్లో ఫోర్త్​ సిటీని నిర్మిస్తున్నం.పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇచ్చే బాధ్యత నాది” అని హామీ ఇచ్చారు. “రాష్ట్ర అభివృద్ధిపై మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ స్లోగన్  అని  25 ఏండ్ల (విజన్​ 2050 ) ప్లాన్​ చేస్తున్నం. మీ అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలి. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాను. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి. సైబరాబాద్ ను చంద్రబాబు, వైఎస్ ఆర్ నిర్మిస్తే.. ఇప్పుడు 30 వేల ఎకరాల్లో ఫోర్త్​ సిటీని ఏర్పాటు చేస్తున్నం. న్యూయార్క్, టోక్యో లా ప్లాన్ చేస్తున్నం” అని ఆయన చెప్పారు. 

రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్​ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల నడుమ సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందామని.. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ ఆదర్శంగా నిలుద్దామన్నారు. దేశాల మధ్య యుద్ధాలు కూడా చర్చలతో ఆగుతున్నాయని గుర్తుచేశారు. ‘‘ఇందిరాగాంధీ విధివిధానాలతో మేం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఇందిరా దత్ తెలుగు వాళ్లందరినీ ఇప్పుడు ఒకే వేదిక మీదికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నా దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమానికి వెళ్దామన్నారు. కార్యక్రమానికి రాకుంటే మంచి కార్యక్రమాన్ని మిస్ అయ్యేవాడ్ని” అని సీఎం తెలిపారు. తెలుగు భాషను కాపాడటానికి ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలని.. మన బాధ్యతను గుర్తు చేసుకోవాలని.. విధి విధానాలకు ఖరారు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సినీ ప్రముఖులు మురళీమోహన్​, జయసుధ, జయప్రద, అశ్వినీదత్, సాయికుమార్​ తదితరులు పాల్గొన్నారు. ​

మాతృభాష శ్వాస లాంటింది: వెంకయ్య నాయుడు
తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ‘‘మన మాతృభాషను మనం ప్రేమించకపోతే, మరెవరు ప్రేమిస్తారు? ప్రతి ఒక్కరూ మాతృభాషలో మాట్లాడడాన్ని అలవాటుగా మార్చుకోవాలి” అని సూచించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో ఆదివారం ఉదయం ఆయన మాట్లాడారు. తన ఎదుగుదలకు తెలుగు భాషే కారణమన్నారు. దేశంలోని పెద్ద పదవుల్లో ఉన్నవారంతా మాతృభాషలోనే చదివినవారని గుర్తుచేశారు. మాతృభాష మన జీవితానికి శ్వాస లాంటిదని పేర్కొన్నారు. ఇంగ్లిష్‌‌ భాషపై వ్యామోహంతో కొన్ని భాషలు అంతరించిపోతున్నాయని.. తెలుగు భాషకు మనమందరం వారసులమని.. తెలుగును భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనని సూచించారు. 

రాష్ట్రాభివృద్ధికి సీఎం కృషి: వివేక్ 
తాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్​లో ఇంగ్లిష్ లో చదువుకున్నానని, రాజకీయాల్లోకి వచ్చాక తెలుగు అవసరం అని తెలుగు నేర్చుకున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గుర్తుచేసుకున్నారు. “తెలంగాణలో మీడియా హౌస్ అవసరమని వీ6 చానల్ ను ప్రారంభించాను. తర్వాత  వెలుగు పేపర్ ను స్థాపించాం. అప్పుడు తెలుగు ప్రాముఖ్యత తెలిసింది. మా మనుమలు, మనుమరాళ్లకు తెలుగు నేర్చుకోవాలని చెప్తుంటాను.  12 రాష్ట్రాల్లో విశాక ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశాం. అన్ని చోట్ల తెలుగు వ్యక్తులు కనిపించారు. ప్రతి చోట తెలుగు వాళ్లు మా ఇండస్ట్రీస్  ఏర్పాటు సమయంలో వచ్చి సహాయం చేశారు” అని ప్రపంచ తెలుగు సమాఖ్య సభల్లో ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సీఎం రేవంత్​రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని.. రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు.  ‘‘ఏ రాష్ట్రంలో చేయని విధంగా స్కిల్ డెవలప్ సెంటర్ స్టార్ట్ చేశారు. దేశంలో చాలా చోట్ల  పెట్టుబడులు పెట్టేముందు స్కిల్ లేబర్ స్టాఫ్ దొరకరని సీఐఐ మీటింగ్​లో  పారిశ్రామికవేత్తలు చెప్పేవాళ్లు. స్కిల్ సెంటర్ ఏర్పాటుతో ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తారు” అని ఆయన తెలిపారు. 

ఈ సభలకు చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చారని,  తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని, ఎక్కువ మంది ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ప్రపంచ తెలుగు సమాఖ్య వరల్డ్ తెలుగు ఫెడరేషన్ కు, కమిటీకి వివేక్ వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు. పట్టుదలతో ప్రతి రెండేండ్లకు ఒకసారి ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు ఏర్పాటు చేస్తున్నారని.. తెలుగును, తెలుగు సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా డబ్ల్యూటీఎఫ్ ప్రెసిడెంట్ ఇందిరా దత్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రతిసారి తనను సభలకు పిలుస్తున్నారని.. ఒక్కసారన్నా వెళదామనుకున్నా కుదరలేదని.. ఇప్పుడు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. కాగా, మహాలక్ష్మి గ్రూప్ చైర్మన్ హరిశ్చంద్ర ప్రసాద్  మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి ఆదేశాల మేరకు వివేక్​ వెంకటస్వామి బిజినెస్ లోకి వచ్చారని, విశాక ఇండస్ట్రీస్ ను స్థాపించి ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. “వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సతిమణి సరోజా విశాక ఇండస్ట్రీస్ బాధ్యతలు చూస్తున్నారు” అని తెలిపారు.