బీచుపల్లిలో 120 క్వింటాళ్ల సీఎంఆర్ వడ్లు చోరీ

గద్వాల, వెలుగు: 120 క్వింటాళ్ల సీఎంఆర్ వడ్లు (40 కేజీల ప్యాకెట్లు 300 బస్తాలు) చోరీకి గురైన ఘటన ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆయిల్ మిల్లు దగ్గర చోటు చేసుకున్నది. ఎస్సై వెంకటేశ్​ వివరాల ప్రకారం.. సాయి గోపాల ఇండోటెక్ ప్లాంట్ కు సంబంధించి సీఎంఆర్ వడ్లను విజయ ఆయిల్ మిల్ దగ్గర గోదామును కిరాయికి తీసుకొని నిల్వ ఉంచుతున్నారు. 25వ తేదీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గోదాం సెంటర్ తెరిచి ఉండడం చూసి గుమస్తా ఓనర్ కు ఫోన్ చేశాడు. 

రైస్ మిల్ ప్రొప్రైటర్ హరినాథ్ అక్కడికి చేరుకొని 300 ప్యాకెట్ల వడ్లు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చోరీకి గురైన వడ్ల ప్యాకెట్లను తరలిస్తున్న డీసీఎంను పట్టుకొని విచారిస్తున్నట్లు తెలుస్తున్నది.