బెంగళూరులో ఓ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ అపార్ట్ మెంటులో రోజుకో పిల్లి చనిపోతుండటం ఎవరికీ అంతుచిక్కడం లేదు. పిల్లుల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పిల్లులు ఎలా చనిపోతున్నాయో తెలుసుకుని షాకయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. 2023 నవంబర్ లో బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్ లోని తమ ఫ్లాట్ లో ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురై 11 పిల్లులు చనిపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పిల్లుల యజమాని శ్యామ్ వీర్ శర్మ. నవంబర్ 10న రాత్రి ఒక పిల్లి చనిపోగా తర్వాతి రోజు నుంచి మిగతా పిల్లులు చనిపోయాయని పోలీసులకు తెలిపాడు. అస్వస్థతకు గురైన కొన్ని పిల్లులను వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్ళాం..చికిత్స కోసం 70 వేలకు పైగా ఖర్చు చేశాం కానీ అవి బతకలేదు అని ఫిర్యాదులో తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పిల్లులను ఎవరో విషం పెట్టి చంపారని ఫోరెన్సిక్ సైన్సెస్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్),ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రి రిపోర్టులు తేల్చాయి. పౌడర్ లో జింక్ పాస్పేట్ కలిపినట్లు గుర్తించారు. జింక్ పాస్ఫేట్ వల్ల పిల్లుల కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె ఇతర అవయవాలు తీవ్రంగా దెబ్బతిని మరణించాయని రిపోర్టులో వెల్లడైంది.
అపార్ట్ మెంట్ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా.. అపార్టెమెంటులో నివసించే ఓ మహిళ పిల్లులకు పెట్టే ఆహారంలో విషపూరిత పౌడర్ ను కలిపినట్లు గుర్తించారు. యజమాని శర్మ పిల్లులకు ప్రతి రోజు కారిడార్ లో అన్నం,నీళ్లు పెట్టేవాడు. అపుడే ఆ మహిళ పిల్లులు తినే ఆహారంలో విషం కలిపిందని పోలీసులు చెప్పారు. జంతువులను చంపడం లేదా,అంగవైకల్యానికి కారణమైనందుకు మహిళపై 428 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు. నేరం రుజువైతే జైలు శిక్ష లేదా జరిమానా విధించబడతాయని తెలిపారు. ఆ మహిళ వ్యక్తిగత విచారణకు రాకుండా న్యాయవాదిని పంపినట్లు తెలిపారు. తనపై చార్జ్ షీట్ ఫైల్ చేస్తామని చెప్పారు.
