ప్రజావాణి అర్జీలు .. సగం పెండింగ్​లోనే

  • భద్రాద్రికొత్తగూడెంలో సగానికిపైగా సమస్యలు పరిష్కారం కావట్లే 
  • ఈ ఏడాదిలో 2,347దరఖాస్తులు వస్తే.. 1,178 పెండింగ్​లోనే..
  • అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అర్జీదారుల వేడుకోలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మండల స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే..  జిల్లా గ్రీవెన్స్​లో అయినా పరిష్కారం అవుతాయని అనుకుంటున్న ప్రజలకు ఇక్కడా నిరాశే ఎదురవుతోంది.  మారు మూల ప్రాంతాల నుంచి ప్రజలకు వచ్చి  కలెక్టరేట్​లో అధికారులకు కలెక్టర్లకు దరఖాస్తులు ఇచ్చి వెళ్తున్నారు.  ఆ అర్జీలను జిల్లా అధికారులు కింద స్థాయి అధికారులు పంపుతున్నారు.

 కానీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు.  గ్రీవెన్స్​లో    ఇప్పటి వరకు 2,347 దరఖాస్తులు రాగా1,169 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం  అయ్యాయి. దాదాపు 843 దరఖాస్తులు ఫార్వర్డ్​ చేశారు. 335 దరఖాస్తులు పూర్తి స్థాయి పెండింగ్​లో ఉన్నాయి.   కలెక్టరేట్​ లోని  బీ సెక్షన్​ పరిధిలో అత్యధికంగా 128 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి.

గ్రీవెన్స్​లు వాయిదా

కలెక్టరేట్​లో కలెక్టర్​ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్​లకు ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు చెప్తున్నారు.   ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 15 నుంచి20కి పైగా గ్రీవెన్స్​లు వాయిదా పడ్డాయి. గోదావరి వరదలు, సర్వేలు, మంత్రుల పర్యటనలు, ఇతరత్రా కారణాలతో గ్రీవెన్స్​లు వాయిదా వేసినట్టుగా ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఇక కలెక్టర్​ దాదాపు 10నుంచి 15కు పైగా గ్రీవెన్స్​లకు అటెండ్​ అయిన దాఖలాలు లేవు. అడిషనల్​ కలెక్టర్లతోనే గ్రీవెన్స్​ కొనసాగే పరిస్థితి జిల్లాలో నెలకొంది. 

Also Read : జోగులాంబ గద్వాల జిల్లాలో పట్టపగలు మట్టిని తరలిస్తున్నా ఆఫీసర్లు గప్చుప్

పెండింగ్​లోనే 1,178 దరఖాస్తులు 

 పరిష్కారం కానీ దరఖాస్తుల వివరాలను దరఖాస్తు దారులకు చెప్పాలని కలెక్టర్​ చెప్తున్నా అది అమలు కావడం లేదు. ఎక్కువ   మంది ఆఫీసర్లు తమ వద్దకు వచ్చిన దరఖాస్తులను కింది స్థాయి ఆఫీసర్లకు ఫార్వర్డ్​ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తర్వాత కాలంలో ఫార్వర్డ్​ చేసిన దరఖాస్తులు ఎంత వరకు పరిష్కారం అయ్యాయో ఫాలో అప్​ ఉండటం లేదు.   

త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం 

గ్రీవెన్స్​లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఆఫీసర్లకు ఆదేశాలిస్తున్నాం. సాధ్యం కాని దరఖాస్తులను ఇస్తుండడంతో పెండింగ్​లో పెట్టాల్సి వస్తొంది. ల్యాండ్స్​ కేసులు, ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం ఉంటుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాలనాపరంగా ఆదేశాలు రావాల్సి ఉంటుంది. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కలెక్టర్​ గ్రీవెన్స్​లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. -  వేణు గోపాల్​, అడిషనల్​ కలెక్టర్​, భద్రాద్రికొత్తగూడెం

ఎక్కడికక్కడ పెండింగ్​

మణుగూరు, చుంచుపల్లి, సుజాతనగర్​,దమ్మపేట తహసీల్దార్​ ఆఫీస్​లతో పాటు అగ్రికల్చర్​, లీగల్​ సెల్​, భూ సేకరణ, కలెక్టరేట్​ ఏవో, ఐటీడీఏ ఏపీఓ, అడిషనల్​ ఎస్పీ అడ్మినిస్ట్రేషన్​, డీఈఓ, ఎంప్లాయిమెంట్​, డీఆర్​డీఏ,ఆర్​ఓఎఫ్​ఆర్​, హౌసింగ్​ డిపార్ట్​మెంట్ల కు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్​లో ఉన్నాయి. కొందరైతే తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు గ్రీవెన్స్​లకు వచ్చి పోతుండడం కామన్​గా మారింది. అయినా ఎప్పటికైనా ప్రజావాణి దరఖాస్తు పరిష్కారానికి నోచుకోకపోదా అని ప్రజలు ఆశతో ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్​ దరఖాస్తుల సంగతి చూడాల్సిన అవసరం ఉంది.