టీచర్లంతా బదిలీ రేగోడు మోడల్ స్కూల్లో గెస్ట్​ ఫ్యాకల్టీనే దిక్కు

  •     ప్రశ్నార్థకంగా రేగోడు మోడల్ స్కూల్ పరిస్థితి
  •     702 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం 
  •     నాలుగు రోజులైనా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
  •     స్టూడెంట్ల జీవితాలతో చెలగాటం  

రేగోడ్​, వెలుగు : మెదక్ జిల్లా రేగోడ్​ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో ఒకే సారి 11 మంది టీచర్లు బదిలీ కావడం తో విద్యార్థుల విద్యపై ప్రభావం పడుతోంది.  ఈ పాఠశాలకు వచ్చేందుకు ఇతర టీచర్లు ఇంట్రెస్ట్​ చూపకపోవడంతో స్కూల్  పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఏర్పడిన ఖాళీల నేపథ్యంలో విద్యాశాఖ గెస్ట్​ ఫ్యాకల్టీల నియామాకానికి చర్యలు చేపట్టినప్పటికీ  విద్యార్థులకు పూర్తి స్థాయిలో  మెరుగైన విద్య అందడం లేదని పేరెంట్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో 12 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు అవకాశం కలిగింది. ఈ క్రమంలో రేగోడు మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న 11 మంది టీచర్లు  ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారంతా ఇటీవల ఇక్కడి నుంచి రిలీవ్ అయి వెళ్లిపోయారు. బదిలీలతో పీజీటీ మ్యాథ్స్, బాటని, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్ టీచర్​లు, టీజీటీ మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్  టీచర్స్ పోస్టులు ఖాళీ అయ్యాయి.  ఇక్కడి నుంచి మొత్తం 11 మంది టీచర్​లు బదిలీ కాగా  సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో రేగోడ్ స్కూల్​కు వచ్చేందుకు వేరే టీచర్లు ఇంట్రెస్ట్​ చూపడం లేదు.

702 మంది విద్యార్థులు

 ప్రస్తుతం మోడల్ స్కూల్​ లో 6వ  తరగతి నుంచి10వ తరగతి వరకు  500 మంది విద్యార్థులు ఉండగా, ఇంటర్మీడియట్ లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో మొత్తం 202 మంది విద్యార్థులు ఉన్నారు. బదిలీల కారణంగా ప్రధాన సబ్జెక్ట్​ టీచర్​లు ఒక్కరూ లేకుండా పోవడంతో స్టూడెంట్స్​కు పాఠాలు చెప్పే వారు కరవయ్యారు. ఇప్పటివరకు ఏటా పదో తరగతి, ఇంటర్మీడియట్​  పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తుండటంతో పాటు, పోటీ పరీక్షలకు సైతం విద్యార్థులను ప్రిపేర్ చేయడంలో రేగోడు మోడల్ స్కూల్ సిబ్బంది ముందంజలో ఉండేవారు.

12 ఏళ్లుగా విద్య బోధన చేసిన టీచర్లు  విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ కావడంతో  మోడల్ స్కూల్  నిర్వహణ అగమ్య గోచరంగా మారింది.  టీచర్లు మూకుమ్మడిగా బదిలీ అయి వెళ్లిపోవడం బోధనపై తీవ్ర ప్రభావం చూపనుంది.  ఈ పరిస్థితిపై విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ  ప్రత్యేక దృష్టి సారించి రేగోడ్ మాడల్​ స్కూల్​ లో ఖాళీ అయిన టీచర్​ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వట్టిపల్లి మండలం మోడల్ స్కూల్ ఎకనామిక్ లెక్చరర్  ప్రవీణను రేగోడు మోడల్ స్కూల్ ఇన్ చార్జి ప్రిన్సిపల్ గా నియమించారు. 

విద్యార్థులు నష్టపోతారు

సజావుగా సాగుతున్న పాఠశాల నుంచి విద్యా సంవత్సరం మధ్యలో టీచర్​లందరిని బదిలీ చేయడం సరికాదు. ఇది ప్రభుత్వ యంత్రాంగం తప్పిదానికి నిదర్శనం. ఇలా అర్ధాంతరంగా టీచర్​ల ను బదిలీ చేయడం వల్ల విద్యా బోధనపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిలబస్​ పూర్తికాక విద్యార్థులు నష్టపోతారు.  ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలి. తక్షణమే మోడల్ స్కూల్​ లలో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలి.

 - నాగరాజు, పేరెంట్​, రేగోడ్​

నోటిఫికేషన్​ జారీ చేశాం

ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం పూర్తిస్థాయిలో  గెస్ట్ ఫ్యాకల్టీల నియామకానికి నోటిఫికేషన్​ జారీ చేశాం. అన్ని సబ్జెక్ట్​ లకు అర్హులైన వారిని గెస్ట్​ ఫ్యాకల్టీలుగా తీసుకుంటాం.- ప్రవీణ, ఇంఛార్జి ప్రిన్సిపల్ 

గెస్ట్​ ఫ్యాకల్టీని నియమిస్తాం

 టీచర్​లు బదిలీ అయిన నేపథ్యంలో  ప్రత్యామ్నాయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించాం. రేగోడు మోడల్ స్కూల్ లో  హవర్స్ వైస్ గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకోవడానికి అనుమతి వచ్చింది. ఖాళీలను పరిశీలించి పూర్తిస్థాయిలో గెస్ట్ ఫ్యాకల్టీని నియమించి విద్యార్థులకు పాఠాలు బోధించేలా చర్యలు తీసుకుంటాం.  - రాధాకిషన్, డీఈఓ, మెదక్