విద్యా కమిషన్​కు 100 రోజులు

  • విద్యారంగంపై సమావేశాలు.. సమీక్షలు
  • 257 విద్యాసంస్థల్లో పర్యటన.. 3 రాష్ట్రాల సందర్శన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ కు వంద రోజులు పూర్తయ్యాయి. విద్యా ప్రమాణాలు మరింత పెంచేందుకు సెప్టెంబర్ 3న విద్యా కమిషన్​ఏర్పాటైంది. చైర్మన్​గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని నియమించగా, సభ్యులుగా ప్రొఫెసర్ పీఎల్  విశ్వేశ్వర్ రావు, చారగొండ వెంకటేశ్, కె.జ్యోత్స్నకు అవకాశం కల్పించారు. కమిషన్​ ఏర్పాటైన 100 రోజుల్లో నిత్యం అధికారులు, టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు.. ఇలా అందరితో సమావేశాలు, సమీక్షలతో కమిషన్ బిజీబిజీగా మారిపోయింది. 

అంగన్ వాడీల నుంచి యూనివర్సిటీల వరకూ అన్ని రకాల విద్యాసంస్థలను కమిషన్ సందర్శించింది. ఈ వంద రోజుల కాలంలో 257 విద్యాసంస్థల్లో పర్యటించింది. ఎన్జీవోలు, పౌరసమాజ సంస్థలతో 13 సమావేశాలు, టీచర్లు.. లెక్చరర్లు, ప్రొఫెసర్ల సంఘాలతో 12 మీటింగ్​లు నిర్వహించింది. 

ప్రపంచ బ్యాంక్, యూనిసెఫ్ అధికారులతో కమిషన్ అధికారులు 2 సార్లు భేటీ అయ్యారు. 3 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించగా, ఉన్నతాధికారులతో 2 సార్లు మీటింగ్ నిర్వహించారు. 3 రాష్ట్రాల్లో పర్యటించారు. జిల్లాస్థాయి అధికారులతో 4 సార్లు సమావేశాలు జరగ్గా, సలహా కమిటీతో ఒకసారి మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఫీజుల కట్టడిపై విద్యా కమిషన్​ సమీక్ష జరుపుతున్నది.