వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో క్షయ వ్యాధిని నివారించేందుకు చేపడుతున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సక్సెస్ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వందరోజుల ప్రణాళికపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో క్షయ వ్యాధి పరీక్షలు టార్గెట్ మేరకు చేయనందుకే సమస్యాత్మక జిల్లాగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు.
2025 మార్చి 24 వరకు దేశంలో క్షయ వ్యాధి ఆనవాళ్లు లేకుండా పారద్రోలేందుకు కేంద్ర ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు గుర్తించి వైద్యం అందించాలని సూచించారు. ఆశాలు, ఏఎన్ ఎంలు ఇంటింటికీ తిరిగి టీబీ వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ వో శ్రీనివాసులు, డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
వందశాతం రుణాలు గ్రౌండింగ్ చేయాలి
జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న బ్యాంకు రుణాలు ఈనెల21 లోపు వందశాతం గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ లో బ్యాంకర్లతో నిర్వహించిన ప్రత్యేక జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 21న వనపర్తి జిల్లాకు సీఎం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన అన్ని రకాల సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆయా పథకాల కింద 2019 నుంచి మంజూరు చేయని రుణాలు వెంటనే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్, నాబార్డ్ డీడీ ఎం.షణ్ముఖచారి, మూర్తి, ఉమా దేవి, బ్యాంక్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.