10 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్​లు రద్దు.. 70 శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే..

  • 6 నెలలపాటు క్యాన్సిల్..ఇంకా పొడిగించే చాన్స్​!
  • తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్టీఏ కొరడా
  • ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల  సిఫారసు మేరకు నిర్ణయం
  • లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారమిచ్చిన అధికారులు

హైదరాబాద్, వెలుగు:ట్రాఫిక్  నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ  ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 30 వరకు కేవలం 8 నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 వేల 113 మంది డ్రైవింగ్ లైసెన్స్​లను  6 నెలల పాటు రద్దు చేశారు. ఇందులో 70 శాతం వరకు మందుబాబుల లైసెన్స్ లే ఉన్నట్టు ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. మందు తాగి రెండోసారి, మూడోసారి పోలీసులకు పట్టుబడ్డ వారి లైసెన్స్​లను కోర్టు ఆదేశం మేరకు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసిన సిఫారసుతో రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు.

ఈ విషయాన్ని రవాణా శాఖ అధికారులు సంబంధిత లైసెన్స్ దారులకు లేఖల ద్వారా తెలియజేశారు. ఏయే కారణాలపై డ్రైవింగ్ లైసెన్స్​లు రద్దు చేస్తున్నారో చెప్తూ  లైసెన్స్ దారులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు పంపించారు. రద్దయిన లైసెన్స్​లలో 70 శాతం మందు బాబులవి కాగా, మరో 30 శాతం ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెవీ లోడ్ తో రోడ్లపై భారీ వాహనాలను నడుపుతూ పట్టుబడ్డ వాహనదారులవి ఉన్నాయి. 

రద్దు పొడిగించే అవకాశం!

సాధారణంగా రవాణా శాఖ అధికారులు  ఏటా ఏప్రిల్​1 నుంచి మార్చి 31 వరకు  ఒక సంవత్సరంగా పరిగణించి ఒకేసారి డ్రైవింగ్ లైసెన్స్​లను రద్దు చేస్తారు.కానీ, జాప్యం చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ఈసారి రూట్​మార్చారు. ఏడాది వరకు ఆగకుండా మార్చి నుంచి 8  నెలల కాలానికి  సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేస్తూ ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.  పలు సందర్భాల్లో  కోర్టులు,  ట్రాఫిక్,  లా అండ్ ఆర్డర్ పోలీసుల నుంచి కూడా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని రవాణాశాఖపై పెరిగిన ఒత్తిళ్లు కూడా ఇందుకు కారణంగా చెప్తున్నారు.

Also Read :- మోహన్ బాబు, మనోజ్, విష్ణు ముగ్గురికి పోలీసుల నోటీసులు

ఈ  నేపథ్యంలోనే వచ్చే ఏడాది మార్చి వరకు ఆగకుండా మొదటిసారి 8 నెలల వ్యవధితోనే  లైసెన్స్ ల రద్దు నిర్ణయాన్ని ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయంతో 10 వేల 113 మంది కి చెందిన డ్రైవింగ్ లైసెన్స్ లు 6 నెలలపాటు సస్పెన్షన్ లో ఉండనున్నాయి. ఆ తర్వాత వీటిపై సస్పెన్షన్ ఎత్తివేయాలా? లేక మరో ఆరు నెలలు పొడిగించాలా? అనేది  ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల నుంచి వచ్చే సిఫారసులపై ఆధారపడి ఉంటుందని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. 

గత  మూడేండ్లలో 64 వేలకుపైగా..

గత  మూడేండ్లలో 64,083 డ్రైవింగ్​లైసెన్స్​లను ఆర్టీఏ అధికారులు రద్దుచేశారు.  2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 31 వరకు 14 , 220,  2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు 30, 638, 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు 19, 225 డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దయ్యాయి. తాజాగా, 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు 10 వేల 113 లైసెన్స్ లను క్యాన్సిల్​ చేస్తూ రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి ఏటా రద్దయ్యే లైసెన్స్​లలో 70 శాతం వరకు డ్రంక్​ అండ్​​ డ్రైవ్​కేసులే ఉంటున్నాయని ఆర్టీఏ ఆఫీసర్లు చెప్తున్నారు. మందుతాగి మొదటిసారి పట్టుబడితే ఫైన్లతో సరిపెడ్తున్న అధికారులు, రెండోసారి, మూడోసారి పట్టుబడితే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్​లు రద్దు చేస్తున్నారు.  కానీ టెక్నికల్ సమస్యలకు తోడు స్టాఫ్ పై ఇతర పని ఒత్తిడి వల్ల  డ్రైవింగ్ లైసెన్స్ ల క్యాన్సిల్​పై సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని  రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు  ఇకపై  ప్రతి 6 నెలలు లేదంటే 3 నెలలకోసారి ఎప్పటికప్పుడు వచ్చిన సిఫారసుల ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.