ముంబై: లోక్ సభ ఐదో దశ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ముంబైలో పలు వ్యాపార సంస్థలు ఓటర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించాయి. లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ఈనెల 20న జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్థానిక ప్రభుత్వంతో కలిసి రెస్టారెంట్లు, కెఫేలు, మెట్రో లాంటి సంస్థలు వివిధ ఆఫర్లు ఇచ్చాయి. ఓటు హక్కు వినియోగించుకున్న తమ కస్టమర్లకు జర్నీలో 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని ముంబై మెట్రో తెలిపింది. మెట్రో లైన్స్ 2ఏ, 7 ప్రయాణికులకు పోలింగ్ రోజున ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.
‘‘ముంబై 1 కార్డ్, పేపర్ క్యూఆర్, పేపర్ టికెట్లు వినియోగించుకునే వారికి ఈ డిస్కౌంట్ ఇస్తాం. ఆ ప్రయాణికులు పోలింగ్ తేదీన ఓటింగ్ కేంద్రాలకు వచ్చేటపుడు, తిరిగి ఇంటికి వెళ్లేటపుడు జర్నీలో బేస్ ప్రైస్ పై 10% రాయితీ ఇస్తాం” అని ముంబై మెట్రో అధికారులు వెల్లడించారు. అలాగే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ముంబై విభాగం ‘డెమోక్రసీ డిస్కౌంట్’ పేరుతో ఓటర్లకు 20 శాతం తగ్గింపు ప్రకటించింది. ఐదో దశలో ఓటుహక్కు వినియోగించుకున్న వారికి ముంబై వ్యాప్తంగా ఉన్న తమ 108 స్టోర్లలో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఎన్ఆర్ఏఐ తెలిపింది. ఈనెల 20, 21న ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని పేర్కొంది. ఓటర్లు పోలింగ్ రోజున బయటకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని ఎన్ఆర్ఏఐ ముంబై విభాగం హెడ్ రాచెల్ గోయెంకా కోరారు. అలాగే, ఒక యోగా స్టూడియో కూడా ఆఫర్ ప్రకటించింది. ఓటువేసిన వారు సిరా గుర్తుతో సెల్ఫీ దిగి, ఆ ఫొటోను తమ స్టూడియోకు ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాలో పెడితే ఈ నెల 24న ఫ్రీగా యోగా పాఠాలు చెబుతామని తెలిపింది.
