జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లకు 10 లక్షల అప్లికేషన్లు

  • రాష్ట్రంలో ఇక్కడి నుంచే అత్యధికం
  • తక్కువగా ములుగులో90 వేల దరఖాస్తులు
  • రాష్ట్రంలో 44 శాతం సర్వే పూర్తి
  • 9 లక్షల మందికి సొంత జాగాలు
  • జీహెచ్ఎంసీలో 1,164మందికే సొంత జాగాలు
  • అధికారుల సర్వేలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. 10లక్షలకు పైగా దరఖాస్తులు ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. ప్రజా పాలన కార్యక్రమంలో అన్ని జిల్లాలు, జీహెచ్ఎంసీలో మొత్తం 80,54,554 మంది అప్లై చేసుకున్నారు. జీహెచ్ఎంసీ నుంచి 10లక్షల 70 వేల 659 మంది దరఖాస్తు చేసుకున్నారు. 4,31,181 అప్లికేషన్లతో నల్గొండ రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత వరుసగా రంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 90,863 మంది మాత్రమే అప్లై చేసుకోగా, సిరిసిల్ల, భూపాలపల్లి, జనగాం, మేడ్చల్ జిల్లాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ల సర్వే మంగళవారం నాటికి 44 శాతం పూర్తి అయింది. జీహెచ్ఎంసీలో మాత్రం 7 శాతమే పూర్తయిందని హౌసింగ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందిరమ్మ అప్లికేషన్ల సర్వే యాప్ ద్వారా వేగంగా సాగుతున్నది. అధికారుల సర్వే ప్రకారం ఇప్పటి వరకు 9,19,676 మందికి ఇంటి నిర్మాణానికి జాగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇందులో స్లాబ్ ఇండ్లు, రేకుల ఇండ్లు, పెంకుటిళ్లు, తాటాకుల ఇండ్లు అనే కేటగిరిలుగా అధికారులు విడదీశారు. వీరిలో తొలి దశలో వ్యవసాయ భూమి లేని నిరుపేదలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సొంత జాగా ఉన్న వాళ్లు తక్కువ

జీహెచ్ ఎంసీ     1,164
భూపాలపల్లి     10,631
గద్వాల     16,743
ఎక్కువ
నల్గొండ    62,270
ఖమ్మం     54,667
సూర్యాపేట    43,028
ఎక్కువ అప్లికేషన్లు వచ్చిన జిల్లాలు
గ్రేటర్ హైదరాబాద్     10,70,650
నల్గొండ     4,31,181
రంగారెడ్డి     3,75,013
ఖమ్మం     3,57,869
సూర్యాపేట     3,09,062
సంగారెడ్డి      3,18,775
తక్కువ అప్లికేషన్లు వచ్చిన జిల్లాలు
ములుగు     90,863
సిరిసిల్ల      1,07,398
భూపాలపల్లి     1,23,461
జనగాం    1,43,187
మేడ్చల్     1,43,267