ఏడాదిన్నరలో 10 లక్షల జాబ్‎లు ఇచ్చినం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఏడాదిన్నరలో 10 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ చరిత్రలో ఇది పెద్ద రికార్డ్‌‌ అని తెలిపారు. గత ప్రభుత్వాలు యువతను పట్టించుకోలేదని విమర్శించారు. శాశ్వత ఉద్యోగాలు కల్పించలేదన్నారు. తమ హయాంలో మాత్రం నిజాయితీగా, పారదర్శకంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ప్రకటించారు. రోజ్​గార్ మేళాలో భాగంగా దేశంలోని 45 లోకేషన్లలో 71వేల మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సోమవారం అపాయింట్​మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘గత పదేండ్లుగా యువతకు ఉద్యోగాలిస్తున్నం.

రోజ్​గార్ మేళా కింద ఇప్పటి వరకు కోట్లాది మంది యువతీ, యువకులకు ఉపాధి కల్పించాం. హోంశాఖ, హయ్యర్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్​తో పాటు మరికొన్ని డిపార్ట్​మెంట్లలో యువతకు ఉద్యోగాలిచ్చినం. దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం. ఉద్యోగాలు పొందినవాళ్లంతా భక్తితో, నిజాయితీతో దేశం కోసం పని చేస్తున్నారు. ఇలాగే, ముందుకుసాగితే 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలం. అపాయింట్​మెంట్ లెటర్లు పొందిన అందరికీ నా అభినందనలు. రెండు రోజుల కిందే కువైట్ వెళ్లొచ్చిన. ఆయా రంగాల్లో అక్కడ పని చేస్తున్న మనోళ్లతో మాట్లాడిన. వారి బాధలు తెలుసుకున్న’’ అని ప్రధాని మోదీ తెలిపారు.

యువత చేతుల్లోనే పాలసీల రూపకల్పన

గతంలో రూరల్, దళిత, వెనుకబడిన, గిరిజన యువకులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్, టీచింగ్ విషయంలో భాషా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని మోదీ తెలిపారు. కానీ.. తాము అధికారంలోకి వచ్చాక మాతృ భాషలోనే ఎగ్జామ్స్, టీచింగ్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ‘‘13 భాషల్లో రిక్రూట్​మెంట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. అపాయింట్​మెంట్ లెటర్లు పొందినోళ్లలో ఎక్కువ మంది మహిళలు ఉండటం ఎంతో సంతోషకరం. వీరంతా సాటి మహిళలకు స్ఫూర్తిగా నిలవాలి. ప్రతి సెక్టార్​లో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నం. 

మహిళల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సవాళ్లను తొలగిస్తున్నం. మేక్‌‌ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా, స్టార్టప్  ఇండియా వంటి పాలసీలు తీసుకొచ్చాం. వీటన్నింటినీ యువతే డిజైన్ చేసింది. ప్రస్తుతం ఇండియా అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నది. అంతరిక్షం, రక్షణ, మొబైల్ తయారీ, రెన్యూవబుల్ ఎనర్జీ, పర్యాటక రంగాల్లో ఇండియా ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నది. ఈ రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినం. 

వీటితో యువత ఎంతో లబ్ధి పొందుతున్నది’’అని మోదీ తెలిపారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. గ్రామీణ ప్రాంతాలు డెవలప్ అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చరణ్ సింగ్ నమ్మవారని గుర్తు చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు, తీసుకొచ్చిన పాలసీలు ఉపాధికి కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచామన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.