- చిన్న ఇన్వెస్టర్లు నేరుగా మార్కెట్‌లోకి
- ఐటీ, బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్స్ షేర్లలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్లు
బిజినెస్ డెస్క్, వెలుగు: ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన చాలా మంది ఇప్పుడు డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నారు. కొన్ని టాప్ క్వాలిటీ షేర్లను కొని లాంగ్ టెర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు. ఇటువంటి ఆలోచన ధోరణి కరోనా సంక్షోభం తర్వాత నుంచి పెరిగిందని చెప్పాలి. అందుకే దేశంలో డీమాట్ అకౌంట్లు ఆగస్టు 31 నాటికి 10 కోట్లను టచ్ చేశాయి. ఎన్‌ఎస్‌డీఎల్ దగ్గర 7 కోట్ల డీమాట్ అకౌంట్లు ఓపెన్ కాగా, సీడీఎస్‌ఎల్ దగ్గర 3 కోట్ల డీమాట్ అకౌంట్‌లు క్రియేట్ అయ్యాయి. ప్రజలకు ఈక్విటీ మార్కెట్‌లపై అవగాహన పెరుగుతుండడంతో కొత్తగా మార్కెట్‌లోకి ఎంటర్ అయిన వారు వేగంగా పెరుగుతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ రికార్డ్ లెవెల్‌కు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? అనే ఆలోచనలు కూడా ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. మిగిలిన దేశాల మార్కెట్‌లతో పోలిస్తే ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీలు వాల్యుయేషన్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇక నుంచి పెద్దగా పెరగడం కష్టమంటున్నారు. ‘మార్కెట్‌లోకి ఇన్వెస్టర్లు వస్తున్నారు. అయినప్పటికీ మార్కెట్ వాల్యుయేషన్ చౌకగా లేదు. కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరుగుతాయని, ఇన్‌ఫ్లేషన్ పీక్ లెవెల్‌ను టచ్ చేసి తగ్గుతోందని అంచనాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా లాంగ్‌టెర్మ్ కోసం హోల్డ్ చేస్తే మంచి లాభాలు సంపాదించొచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ఈక్విటీలవైపు మళ్తున్నారు’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ (రిటైల్) సిద్ధార్థ్ ఖేమ్కా అన్నారు.
కొత్త తరం రిటైల్ ట్రేడర్లు..
పశ్చిమ దేశాల్లో 55 శాతం మంది ప్రజలు షేరు మార్కెట్‌లో పాల్గొంటున్నారు. కానీ, మన దగ్గర కేవలం 5–6 శాతం మంది మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. బ్రోకర్లు ప్రజలకు ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లపై అవగాహన పెంచాలని చెప్పారు. డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీ అప్‌స్టాక్స్ తమ రిటైల్ ట్రేడర్లలో 35 నుంచి 50 ఏళ్లు మధ్య ఉన్నవారు ఎక్కువ యాక్టివ్‌గా స్టాక్ మార్కెట్‌లో పాల్గొంటున్నారని పేర్కొంది. మహిళా ట్రేడర్లు కూడా పుంజుకుంటున్నారని, కానీ, మగవారితో పోలిస్తే వీరి వాటా తక్కువగా ఉందని వివరించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మగవారు, మహిళల పార్టిసిపేషన్ రేషియో 80:20 ఉంది.
