అరుణాచల్ ప్రదేశ్ లోని భారత్ - చైనా సరిహద్దులో జులై 5న తప్పిపోయిన 19 మంది కూలీల్లో ఒకరి మృతదేహం లభించింది. డామిన్ జిల్లాలోని కుమే నది సమీపంలో కూలీ మృతదేహాన్ని గుర్తించారు. సరిహద్దుల్లోని ఓ మారుమూల గ్రామంలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులు చేసేందుకు ఈ కూలీలు డామిన్ జిల్లాకు వచ్చారు. వారంతా తమకు బక్రీద్ పండుగ సెలవు ఇవ్వాలని కోరగా, కాంట్రాక్టర్ అందుకు తిరస్కరించాడని పోలీసులు తెలిపారు. సెలవు ఇవ్వకపోవడం వల్లే వారు అక్కడి నుంచి అకస్మాత్తుగా వెళ్లిపోయి ఉండొచ్చని చెప్పారు. ఇలా వెళ్లిపోయే క్రమంలోనే కుమే నదిలో కూలీలు మునిగిపోయి ఉంటారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈనేపథ్యంలో కూలీల ఆచూకీని గుర్తించేందుకు రెస్క్యూ టీమ్ ను పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
