మాట్లాడొద్దని చెప్పినా వినకుండా వేధింపులు .. పూర్ణిమ సూసైడ్​లో కేసులో నిందితుడు అరెస్ట్

  • 24 గంటల్లోనే కేసును ఛేదించిన జవహర్ నగర్ పోలీసులు

జవహర్ నగర్, వెలుగు: యాసిడ్ తాగి యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితుడిని జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదయ్య వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని న్యూ భవానీ నగర్ కాలనీకి చెందిన పోలగంటి తానేశ్, పద్మ దంపతులు. వీరి కూతురు పూర్ణిమ (19) డిగ్రీ చదువుతోంది. అదే కాలనీకి చెందిన యువకుడు శివరాత్రి నిఖిల్(21) కూలీ పనులు చేస్తున్నాడు. పూర్ణిమకు నిఖిల్ పరిచయం కావడంతో కొద్దిరోజులు చాటింగ్ చేసుకున్నారు. 

ఇటీవల మాట్లాడొద్దని యువకుడికి పూర్ణిమ చెప్పినా వినకుండా పదేపదే మెసేజ్​లు చేస్తూ వేధించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఈ నెల 24న యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు కారణమైన నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి 24 గంటల్లోనే పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి గురువారం రిమాండ్ కు తరలించారు.