హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కు బెయిల్ నిరాకరణ

హత్య కేసులో రెజ్లర్ సుశీల్ కు బెయిల్ నిరాకరణ
  • రెండుసార్లు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్

న్యూఢిల్లీ: సాగర్ రాణా అనే రెజ్లర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండుసార్లు ఒలింపిక్ విజేత సుశీల్ కుమార్ కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు మరోసారి నిరాకరించింది. గత ము రోల 4వ తేదీన ఛత్రపాల్ స్టేడియంలో రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ రాణా అనే 23 ఏళ్ల రెజ్లర్ చనిపోయిన విషయం తెలిసిందే. సాగర్ రాణా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ తోపాటు ముండ్కా ప్రాంతానికి చెందిన మరో నిందితుడు అజయ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా జూన్ 2వ తేదీ నుంచి జైలులో ఉంటున్నారు. 
సుశీల్ కుమార్ తరపున లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చనిపోయిన రెజ్లర్ సాగర్ ను సుశీల్ కుమార్ తదితరులు అడవి పందిని వేటాడినట్లు వేటాడి చచ్చిపోతానంటూ ఏడుస్తున్నా వినిపించుకోకుండా దారుణంగా కొట్టడం వల్లే చనిపోయాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ కుమార్ శ్రీవాస్తవ కోర్టులో వాదించారు. సుశీల్ కుమార్ కు ఘర్షణతో సంబంధం లేదని.. కావాలనే కేసులో ఇరికించారని ఆయన తరపు లాయర్ వాదించారు. చనిపోయిన రోజ్లర్ మరణ వాంగ్మూలాన్ని 40 రోజులు ఆలస్యంగా కోర్టుకు సమర్పించారని గుర్తు చేశారు. ఈ హత్య కేసులో 155మందిని విచారించిన ఢిల్లీ పోలీసులు 13 మందిపై  ఐపీసీ 302, 307, 147 సెక్షన్ల కింద చార్జిషీట్ దాఖలు చేశారు. 
హత్య జరిగిన వెంటనే సుశీల్ కుమార్ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవడంతో అతని కోసం పోలీసులు మూడు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. మీడియాలో విస్తృతంగా ప్రసారాలు, కథనాలు పుంఖానుపుంఖాలుగా వస్తుండడంతో పోలీసులు ఒకానొక దశలో సుశీల్ కుమార్ ఆచూకి చెబితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు. 
2008 బీజింగ్ లో జరిగిన ఒలింపిక్స్ లో , అటు తర్వాత 2012లో లండన్ ఒలింపిక్స్ లో సుశీల్ కుమార్ భారత దేశం తరపున పాల్గొని కాంస్య, రజత పతకాలు సాధించి గర్వకారణంగా నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ కు ముందు హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు.