వైద్యం వికటించి మహిళ బ్రెయిన్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌ ?

నస్పూర్, వెలుగు: పీఎంపీ చేసిన ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వికటించడంతో మహిళ బ్రెయిన్‌‌‌‌‌‌‌‌డెడ్‌‌‌‌‌‌‌‌ అయింది. మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున కాలనీకి చెందిన చింతం శ్రీలత (24) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం స్థానిక పీఎంపీ ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ వద్దకు తీసుకెళ్లారు. పీఎంపీ శ్రీలతకు రెండు ఇంజక్షన్లు ఇవ్వడంతో ఆమె చలితో ఇబ్బంది పడడంతో పాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైంది.

దీంతో శ్రీలతను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఉందని కరీంనగర్‌‌‌‌‌‌‌‌ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి తీసుకెళ్లగా తాము టేకప్ చేయలేమని, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ తీసుకెళ్లమని చెప్పారు. అక్కడికి వెళ్లిన తర్వాత పరీక్షలు చేసిన డాక్టర్లు శ్రీలత బ్రెయిన్‌‌‌‌‌‌‌‌డెడ్‌‌‌‌‌‌‌‌ అయినట్లు నిర్ధారించారని శ్రీలత భర్త రాజు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు పీఎంపీని క్లినిక్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేసి అతడిని అదుపులోకి తీసుకొని ఇంజక్షన్లు, సెలైన్‌‌‌‌‌‌‌‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కనే ఉన్న మహాలక్ష్మి మెడికల్‌‌‌‌‌‌‌‌ షాప్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకుడిని సైతం పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.