ఆధ్యాత్మికం: ధర్మం అంటే ఏమిటి... శ్రీకృష్ణుడు... అర్జునుడితో ఏమన్నాడో తెలుసా..

నీకు. ..నాకు కూడా ఎన్నో జన్మలు జరిగాయి. నీకు గుర్తు లేదు. ...నాకు గుర్తు ఉన్నాయి. అని అర్జునుడితో కృష్ణుడు చెప్పాడు. తను ఎందుకు పుట్టవలసి వచ్చిందో, ధర్మం అంటే ఏమిటో ...మళ్ళీ అర్జునుడికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా కృష్ణుడు వివరించటం ప్రారంభించాడు.

ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు ఆ ధర్మాన్ని పునరుద్ధరించటానికి నన్ను నేను సృష్టించుకుంటానని శ్రీకృష్ణుడు అర్జునిడికి తెలిపాడు.  బహుశా అందుకేనేమో భారతయుద్దంలో పాండవుల పక్షాన ఉండి ధర్మాన్ని గెలిపించి అధర్మంగా వ్యవహరించిన కౌరవుల ఓటమికి కీలకపాత్ర వహించాడు.   అంటే భూలోకంలో ధర్మం గతి తప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.   అవతరించటం  అంటే మళ్లీ పుట్టడం.. ఆకాశం నుంచి భూమిపైకి రావడం  అని అర్థం. 

అవతరించడం అంటే భూలోకాని కంటే పైన ఉన్నలోకంలో నుండి ఈ లోకానికి రావటం అని అర్ధం చేసుకోవాలి. సామాన్య జీవులు కూడా పుడతారు...కానీ, అప్పటివరకు ఎక్కడ ఉన్నారో. ... శరీరం వదిలిన తరువాత ఎక్కడికి వెళ్తారో వాళ్లకి తెలియదు. వారికి జన్మ బంధం తప్పనిసరని శ్రీకృష్ణుడు... అర్జునుడికి వివరించాడు. 

సామాన్య జీవులు పూర్వ జన్మల కర్మలననుసరించి జన్మిస్తారు.  కర్మ ఫలాన్ని అనుభవించడానికి పుడతారు. పుట్టుకలో స్వేచ్ఛ ఉండదు. భగవంతుడికి కర్మఫలం అనుభవించ వలసిన పని లేదు. అందుకని భూ భారం తగ్గించి, ధర్మం పునః ప్రతిష్ఠించవలసిన అవసరం కలిగినప్పుడల్లా తగిన రీతిలో పుడుతుంటాడు భగవంతుడు పుడుతుంటాడని అర్దమవుతుంది. అలానే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడు.

ధర్మానికి హాని కలిగినప్పుడు అవతరించడం గురించి తెలుసుకునే ముందు ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి.   ధర్మం అంటే ధరించేది, ధరింపబడేది అని రెండు అర్థాలున్నాయి. ఏ నియమాన్ని అనుసరించి ఈ సృష్టి ఈ విధంగా నిలిచి ఉన్నదో అది ధర్మం...భూమి అంతరిక్షంలో అస్తవ్యస్తంగా అటు ఇటు పోకుండా నిర్దిష్టమైన కక్ష్యలో నిర్దిష్టంగా  తిరగడానికి ధర్మమే  కారణం.. అట్లాగే తిరగటం దాని ధర్మం. అంటే భూమి ధర్మ పరంగా సహజ లక్షణం వచ్చిందని శ్రీకృష్ణుడు.. అర్జునిడికి వివరించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ప్రకృతి  సహజమైన నియమం. ... దానిని పాటించటమే దాని ధర్మం. సృష్టిలోని సమస్తం ధర్మాన్ని అనుసరించి నడువాలి. మానవుడు  కూడా ధర్మాన్ని అనుసరించినంత కాలం అంతా సవ్యంగా ఉన్నట్టే.... ఎప్పుడైతే జీవులు ప్రకృతి సహజంగా కాక వికృతంగా ప్రవర్తించటం మొదలు పెడతారో అప్పుడు
ధర్మం నశిస్తుంది.  అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భూభారం పెరుగుతుంది. జనాభా పెరుగుదల వల్ల భూభారం పెరగదట. ఈ మాట ఒక సందర్భంలో భూమాత స్వయంగా శ్రీకృష్ణుడికి చెప్పింది. భూభారం పెరిగినప్పుడు దానిని తగ్గించి ధర్మాన్ని నిలబెట్టటానికి తాను దిగివస్తానని శ్రీకృష్ణుడు భూమితో చెప్పాడని వేదాలు చెబుతున్నాయి.

భగవంతుడు అవతరించటం అంటే... శంఖం, చక్రం, గద వంటి ఆయుధాలు, ఆభరణాలతో మనం ఫొటోల్లో చూసే విధంగా అవతరిస్తాడు అనుకోవద్దు. సందర్భాన్ని బట్టి.. అంటే దేశ.... కాల ప్రాంతాల అవశ్యకతను బట్టి, భిన్నమైన రూపాల్లో అవతరిస్తాడు. ఆ అవతారాలు కూడా ఒకే రకమైనవి కావు. కొన్ని ఆవేశావతారాలు... కొన్ని అంశావతారాలు...మరికొన్ని పూర్ణావతారాలు, ఇంకొన్ని పరిపూర్ణావతారాలు.... ఇలా  అన్నింటిలోనూ భగవత్తత్త్వం నిండి ఉంటుంది.ఇంకా  చెప్పాలంటే, అవసరాన్ని బట్టి భగవంతుడు ధర్మాన్ని ప్రతిష్ఠించటం కోసం తగినది అనిపించిన రూపం ఏదైనా ధరిస్తాడు. 

విష్ణుమూర్తి  మత్స్య, కూర్మ, వరాహాది రూపాలలో భూమిపైకి వచ్చి రాక్షసులను సంహరించాడని పండితులు చెబుతుంటారు.  ఈ విధంగా దిగిరావటంలో ప్రయోజనం ఏమిటి... ధర్మాన్ని అనుసరించి సాధువులని కాపాడటం, ధర్మానికి హాని కలిగించి, ధర్మాన్ని అనుసరించే వారికి ఇబ్బంది కలిగించే వారిని శిక్షించటం.. భూలోకంలో  ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించటం కోసం  ప్రతియుగంలోనూ దిగివస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ మాటలతో అర్థమయ్యే అంశం ఒకటి ఉంది. అవతరించాను అని భూతకాలంలో చెప్పలేదు. అవతరిస్తాను అని తద్ధర్మ కాలంలో చెప్పాడు. అంటే ఇంతకు ముందు అవతరించాడు. ఇప్పుడు అవతరించాడు. ఇక ముందు కూడా అవసరమైనప్పుడు అవతరిస్తాడు. 

ఎప్పుడు, ఎట్లా అనేది సందర్భాన్ని అనుసరించి ఉంటుంది. అందుకే మానవాతీతమైన ఘనకార్యాలు సాధించిన వారిని అవతారపురుషులతో పోలుస్తారు.. తెలిసి, ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి భూమి మీద పుట్టి  తను ఆచరించే కర్మము దివ్యము అని చెప్తాడు కృష్ణుడు. తనవే కాదు, అందరి జన్మలు, కర్మలు కూడా తనకు చెందినవే అని అంటాడు. అయితే అందరి జన్మలు, అన్ని కర్మలు దివ్యమైనవే అవాలి కదా. ప్రాకృతాలు ఎట్లా అవుతున్నాయి? అనే సందేహం రావటం సహజం. కర్మాచరణ చేస్తున్నప్పుడు ఉన్న భావనను బట్టి ఆ భేదం వస్తుంది. ఈ పని నేను చేస్తున్నాను అనే భావనతో చేసినప్పుడు ఆ కర్మ సామాన్యకర్మ లేక ప్రాకృతకర్మ అవుతుంది. నా చేత చేయబడుతోంది అన్న భావనతో గాని, అసలు ఎటువంటి అభిప్రాయం లేకుండా గాని చేస్తే అది దివ్యకర్మలో భాగం అవుతుంది. 

భగవంతుడి గురించి, దివ్యకర్మ గురించి తెలుసుకున్న వారే తత్త్వవేత్తలు. అటువంటి వారు శరీరం వదిలిన తరువాత పునర్జన్మ పొందరు. అయితే ఏమవుతారు? అంటే 'నన్నే' చేరుకుంటారు. నన్ను చేరుకుంటారు అనగానే ఇక తిరిగి పుట్టరా? అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. తప్పనిసరిగా కర్మఫలాలని అనుభవించటం కోసం పుట్టవలసి ఉండదు. పరమాత్ముడి దివ్యప్రణాళికలో భాగస్వామి అయి, అవసరానికి తగినట్టు పుట్టటం జరుగుతుంది. స్వచ్ఛందంగా స్వీకరించిన జన్మ కనుక, ఆ సంగతి స్ఫురణలో ఉండి, కర్తవ్యోన్ముఖంగా కర్మాచరణం సాగిపోతుంటుంది. 

ఎరుక కలిగి చేయటం వల్ల కర్మము బంధం కాదు. దివ్యం అవుతుంది. శ్రీమహావిష్ణువు కాన్ని అవతారాలు ధరించి, ఎన్ని చేసినా ఏవీ తనకి అంట లేదు కదా. దానిలో కిటుకు ఇదే. నేను చేస్తున్న పని దివ్యప్రణాళికలో భాగం అనుకుని చేసినప్పుడు దాని ఫలితం అనుభవించటానికి తప్పనిసరిగా మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఎంత సులభం! ఆచరణలో మాత్రం ఎంతో కష్టం. ప్రయత్నం చేస్తూ ఉంటే సరి. ఎప్పటికో అప్పటికి కుదురుతుందని పండితులు అంటున్నారు.