ఓరుగల్లులో ఈ ఏడాదే స్పోర్ట్స్ స్కూల్!

ఓరుగల్లులో ఈ ఏడాదే స్పోర్ట్స్ స్కూల్!
  • జేఎన్ఎస్ లో టెంపరరీగా ఏర్పాటుకు చర్యలు
  • ఆగస్టు 15న ఓపెనింగ్ కు ప్లాన్
  • 4వ తరగతి స్టూడెంట్స్ కు ప్రవేశాలు కల్పించేలా కసరత్తు
  • ఆ తర్వాత ఉనికిచెర్ల శివారులో పర్మినెంట్ బిల్డింగ్
  • హర్షం వ్యక్తం చేస్తున్న వరంగల్ ప్రజలు

హనుమకొండ, వెలుగు: వరంగల్ లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు క్రీడా పాఠశాలతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం మంజూరు చేయాల్సిందిగా ఇక్కడి ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, వారంలోగా జీవో కూడా వెలువడనుంది! దీంతో ఈ ఏడాది నుంచే క్రీడా పాఠశాలలో క్లాసులు స్టార్ట్ చేసేలా కసరత్తు చేస్తున్నారు. 

ప్రభుత్వ ఉత్తర్వులు, పర్మినెంట్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జేఎన్ఎస్ లో టెంపరరీగా ఏర్పాటు చేసే స్పోర్ట్స్ స్కూల్ ను ఆగస్టు 15న ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.

రాష్ట్రంలో నాలుగో స్కూల్.. 

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో రీజినల్ స్పోర్ట్స్ స్కూల్స్ నడుస్తుండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోటి మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో రింగ్ రోడ్డు పక్కనే దాదాపు 135 ఎకరాల మేర కుడా స్థలం ఉండగా, అందులోని సర్వే నెం.325లో 20 ఎకరాల భూమిలో స్పోర్ట్స్ స్కూల్, మరో 30 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. 

ఉమ్మడి జిల్లా నేతల విజ్ఞప్తి మేరకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం సానుకూల స్పందనతో ముందుగా రాష్ట్రంలో నాలుగో స్పోర్ట్స్ స్కూల్ వరంగల్ లో నెలకొల్పేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది టెంపరరీ బిల్డింగ్ లో స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించి, రెండేండ్లలో ఉనికిచెర్ల శివారులోని కుడా ల్యాండ్స్ లో పర్మినెంట్ బిల్డింగ్ అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించారు.

జేఎన్ఎస్ బాయ్స్ హాస్టల్ లో..

స్పోర్ట్స్ స్కూళ్లలో పిల్లలకు అకడమిక్ విద్య అందడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కూడా మంచి ఉద్యోగాలు పొందే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ఎమ్మెల్యేలు స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుపై దృష్టి పెట్టగా, ఈ ఏడాది నుంచే దానిని నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ఈ నెల 23న తెలంగాణ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ స్పెషల్ చీఫ్​ సెక్రటరీ జయేశ్ రంజన్ ను కూడా కలిశారు. 

ఆగస్టు 15న స్పోర్ట్స్ స్కూల్ ఓపెన్ చేయాలని, ఈ మేరకు టెంపరరీ బిల్డింగ్ ను సమకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ జయేశ్ రంజన్ కు వివరించారు. ఆయన కూడా పచ్చ జెండా ఊపగా, వారంలోపు జీవో కూడా వెలువడే ఛాన్స్ ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. ఈ మేరకు స్పోర్ట్స్ స్కూల్ ను టెంపరరీగా జేఎన్ఎస్ లోని బాయ్స్ హాస్టల్ లో ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

ఆగస్టు 15న ఓపెనింగ్!

ఇటీవల తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ  స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించగా, అందులో ఎంపికైన నాలుగో తరగతి విద్యార్థులు దాదాపు 40 మందికి (20 బాయ్స్, 20 గర్ల్స్)కి ఇందులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆ తర్వాత ఏటికేడు తరగతులతోపాటు విద్యార్థులు పెరగనున్నారు. ఇదిలాఉంటే ఆగస్టు 15న స్పోర్ట్స్ స్కూల్ ను ఓపెన్ చేయనుండగా, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గుగులోతు అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా జేఎన్ఎస్ బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ రిపేర్లపై దృష్టి పెట్టారు. 

ఇందులో వారం రోజుల్లోగా రిపేర్లన్నీ పూర్తి చేసి, అందులో క్రీడా పాఠశాల ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నారు. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి లేదా రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా దీనిని ఓపెనింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల్లో క్రీడా వికాసంతో పాటు అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉండటంతో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.