
టమాటా సాస్.. ఎంత ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు. రొట్టె ముక్కలపై, పిజ్జా, బర్గర్ వంటి వాటిపైనే కాకుండా మ్యాగీ లాంటి ఫుడ్ ఐటమ్స్ లోనూ టమాటా సాస్ ఎంతో ఇష్టం తీసుకుంటారు. అలాంటి సాస్ ను.. కుళ్లిపోయిన టమాటాలతో తయారు చేస్తోంది ఓ ప్యాక్టరీ. పాడైపోయిన టమాటాలను సహజంగా పారబోస్తారు.. ఈ ఫ్యాక్టరీ వాళ్లు మాత్రం అలాంటి టమాటాలతో సాస్ తయారీ చేసి మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.
టమాటా ధర ఎక్కువ ఉండొచ్చు.. అలా అని కుళ్లిపోయిన.. రోడ్డు పక్కన పారబోసే టమాటాలతోనే సాస్ తయారు చేయటం అంటే ఈ ఫ్యాక్టరీ వాళ్లు ఎంత దుర్మార్గులో అర్థం అవుతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనేది వీడియో చూస్తే స్పష్టం అవుతుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే...
టమాటా సాస్‌ను సాధారణంగా భారతీయులు వివిధ వంటకాలలో ఉపయోగిస్తారు. అయితే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు సాస్‌పై ఆధారపడుతున్నారు. ఈ సాస్‌లను ఫ్యాక్టరీలలో పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసి, ప్యాక్ చేసి, మార్కెట్లో విక్రయిస్తున్నారు. అంత ఇష్టపడి తినే సాస్ ఉత్పత్తి ప్రక్రియను చూస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని వాడకుండా ఉంటారేమో. అందుకు రుజువుగా నిలుస్తోందీ టమోటా సాస్ తయారీకి సంబంధించిన ఈ వీడియో.
సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోన్న ఈ వీడియోలో కుళ్లిపోయిన టమాటాలు సాస్ తయారీ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పడేయాల్సిన స్థితిలో ఉన్న టమాటాలను.. ఇలా సాస్ తయారీకి ఉపయోగిస్తున్నారు మేకర్స్. దీంతో నెటిజన్లు ఈ కుళ్లిన టమాటాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పదార్థాలతో తయారు చేయబడిన ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను లేవనెత్తుతున్నారు. కాబట్టి మనం తినే ఆహారం, ఉత్పత్తి పద్ధతుల గురించి తెలుసుకోవడం చాలా అవసరమని ఈ సందర్భంగా సూచిస్తున్నారు.