అమిత్​ షాను బర్త​రఫ్ చేయాలి

  • అంబేద్కర్​పై కామెంట్లు బీజేపీ అహంకారానికి నిదర్శనం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీశారు: పీసీసీ చీఫ్ మహేశ్
  • అమిత్ షాను అరెస్ట్ చేయాలి: మంత్రి పొన్నం
  • రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతున్నది: మాణిక్ రావు
  • అంబేద్కర్ విగ్రహాలు ప్రతిష్టిస్తం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్​పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లు బీజేపీ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్​లో మాట్లాడారు. స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ, నెహ్రూను బీజేపీ ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటున్నదని మండిపడ్డారు.

 అమిత్ షాపై చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇప్పటికే బీజేపీపై కాంగ్రెస్ ఆందోళనలు చేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. అంబేద్కర్​ను అవమానించిన అమిత్ షా.. తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. ‘‘అంబేద్కర్ మాకు దేవుడు. అమిత్ షా ఇష్టమొచ్చినట్లు మాట్లాడిండు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసిండు. రాజ్యాంగాన్ని అవమానించిండు. దేశ ప్రజల మనోభావాలతో ఆడుకున్నడు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్ర చేస్తున్నది. రాజ్యాంగం అన్న.. జాతీయ జెండా అన్న.. అమిత్ షాకు గౌరవం లేదు. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలియజేయాలి’’అని మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. 

డ్రామాలు ఆపాలి: నాయిని రాజేందర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకో వేషం వేస్తున్నారని వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ సభ్యులు డ్రంకెన్ డ్రైవ్ పెట్టాలని అంటున్నరు. దాంతో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా స్పీకర్ పెట్టాలి. అభివృద్ధిపై చర్చ జరగకుండా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకుంటున్నరు. సభ టైమ్​ను వేస్ట్ చేస్తున్నరు. భూ భారతి ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలు బయటపడ్తాయి. అందుకే రోజుకో డ్రామాతో సభను పక్కదారి పట్టిస్తున్నరు’’అని రాజేందర్ తెలిపారు.

అంబేద్కర్​ను బీజేపీ అవమానించింది: మంత్రి పొన్నం ప్రభాకర్

అంబేద్కర్​ను అవమానించిన అమిత్ షాను బర్త​రఫ్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ మీద వేసిన జేపీసీపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలి. రాజ్యసభలో ఉన్న మీ ఎంపీలకు ఏం ఆదేశించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అంబేద్కర్​ను బీజేపీ అవమానిస్తే.. బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్​గా ఉన్నది? ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి అమిత్ షాను బర్త్​రఫ్ చేయాలని.. అరెస్ట్ చేయాలని ఎందుకు డిమాండ్ చేయట్లే? బీజేపీ, బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ పడుతున్నయ్. బీజేపీ, అదానీకి మధ్య ఉన్న స్నేహంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయాలి’’అని పొన్నం డిమాండ్ చేశారు. 

అమిత్ షా కామెంట్లను ఖండిస్తున్నం:  ఎమ్మెల్యే మాణిక్ రావు

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్​ను ఉద్దేశిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నామని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. దళితులు, రాజ్యాంగం అంటే బీజేపీకి అసలు గౌరవమే లేదని మండిపడ్డారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతున్నది. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన దయా దాక్షిణ్యాల వల్ల ప్రజాస్వామ్యం నడుస్తున్నది’’అని మాణిక్ రావు మండిపడ్డారు. 

మాకు అంబేద్కరే స్ఫూర్తి: శంకర్

అంబేద్కర్ స్ఫూర్తితో మోదీ ముందుకు వెళ్తున్నారని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అమిత్ చేసిన కామెంట్లను కాంగ్రెస్ వక్రీకరించిందన్నారు. ఏదో విధంగా రచ్చ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని మండిపడ్డారు. ‘‘ఫేక్ వీడియోలు వైరల్ చేస్తూ అమిత్ షా మాటలు వక్రీకరిస్తున్నరు. అంబేద్కర్​ను బీజేపీ ఎప్పుడూ అవమానించలేదు. కాంగ్రెస్ ముందు నుంచి అవమానిస్తున్నది. అంబేద్కర్​ను బీజేపీ దేవునితో సమానంగా చూస్తది’’అని పాయల్ శంకర్ తెలిపారు. 

గల్లీ గల్లీలో అంబేద్కర్ విగ్రహం పెడ్తాం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహం అవసరమా? అని అమిత్ షా అనడం సరికాదని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గల్లీ గల్లీలో అంబేద్కర్ విగ్రహాలు ప్రతిష్టిస్తమని తెలిపారు. ‘‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేను ఈ రోజు ఎమ్మెల్యే అయి. కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్​ను చాలా సార్లు అవమానించింది. ఎన్నికల్లో ఓడించింది’’అని అనిల్ జాదవ్ అన్నారు. 

ఎన్టీఆర్ ఘాట్ జోలికి వెళ్లొద్దు: గోపినాథ్

ఎన్టీఆర్ ఘాట్ తీసేస్తామన్న ఆలోచనను ఖండిస్తున్నామని జుబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపినాథ్ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ జోలికి పోవద్దన్నారు. ‘‘ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా ఎన్టీ రామారావు మార్చారు. ఘాట్ జోలికి పోతే ఊరుకోం. రాష్ట్ర ప్రజలు కూడా బుద్ధి చెప్తరు. ఎన్టీ రామారావు అంటే ఎందుకు అంత భయం? ఎన్టీఆర్, కేసీఆర్ మార్క్ లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది’’అని గోపినాథ్ మండిపడ్డారు.

బీఏసీలో చర్చ లేకుండానే సెషన్: ఎమ్మెల్యే వివేకానంద

బీఏసీలో చర్చ లేకుండా సభ నడుస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘డిసెంబర్ 9న బీఏసీ నిర్వహించకుండా సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ కార్యక్రమాల పేరుతో వెళ్లిపోయారు. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారో బీఏసీలో నిర్ణయం తీసుకొని చెప్పాలి. అన్ని స్పీకర్​పై వదిలేసి బయట తిరుగుతున్నరు. పేరుకే ప్రజాపాల.. అన్ని అరాచకాలే..’’అని వివేకానంద మండిపడ్డారు.