శ్రీనగర్‌లో పోలీసుల బస్సుపై కాల్పులు..ఇద్దరు మృతి

శ్రీనగర్‌లో పోలీసుల బస్సుపై కాల్పులు..ఇద్దరు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్‌ శివారులో పోలీసుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 14 మంది పోలీసులు గాయపడగా.. వారిలో చికిత్సపొందుతూ ఒక SI,సెలెక్షన్‌ గ్రేడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందగా..12 మంది గాయపడినట్టు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. పాంతాచౌక్‌  దగ్గర  జెవాన్‌ ప్రాంతంలోని పోలీస్‌ క్యాంపు సమీపంలోనే పోలీసు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు.

ఇవాళ (సోమవారం) సాయంత్రం సాయుధ పోలీస్‌ బెటాలియన్‌ బస్సుపై ఉగ్రవాదులు  కాల్పులకు తెగబడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని  కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఘటనతో  అలర్టైన  బలగాలు పాంతా చౌక్‌లోని జెవాన్‌ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీనగర్‌ శివారులో పోలీస్‌ బస్సుపై ఉగ్రవాదుల కాల్పుల ఘటనను కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.