అయ్యప్ప భక్తులకు TSRTC శుభవార్త.. ఉచితప్రయాణం... ఎవరికంటే..

అయ్యప్ప భక్తులు కార్తీక మాసంలో మాలను ధరించి దీక్ష చేపట్టి భక్తి శ్రద్ధలతో ఆ మణికంఠ స్వామిని ఆరాధిస్తారు. 41 రోజులు నియమ నిష్ఠలతో దీక్ష చేపట్టిన స్వాములు 41 రోజుల తరువాత శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ముడుపు చెల్లించి దీక్షను విరమిస్తారు. అయితే కేరళ లోని శబరిమలకు వెళ్లేందుకు భక్తులు ప్రయివేట్ బస్సుల్లో, ట్రైన్లలో ప్రయాణిస్తుంటారు. 

 కార్తీక మాసంలో హిందువుల్లో చాలామంది అయ్యప్ప మాలను ధరిస్తారు. కనుక భక్తులందరూ ఆ సమయంలో శబరిమలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. దీనితో చాలా మందికి ట్రైన్ టికెట్లు దొరకవు.. అలాంటి వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ ని సంప్రదిస్తారు. ఈ క్రమంలో కార్తీక మాసం సీజన్ కావడం చేత టికెట్ ధర అధికంగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం భక్తులు ఎదుర్కునే సమస్యే.

అయితే ఈ ఏడాది ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అయ్యప్ప భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చేందుకు సిద్ధమైంది.  సుశిక్షితులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ.. టీఎస్‌ ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌లగ్జరీ బస్సులు సమకూర్చనుంది. కాగా ఈ సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీ సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. కాగా ప్రయాణంలో ఇద్దరు మణికంఠ స్వాములకు, ఇద్దరు వంటమనుషులకు, సామాన్లు సర్దేందుకు ఓ వ్యక్తికి ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

అలానే ఆర్టీసీ బస్సును అద్దెకు బుక్‌ చేసిన గురుస్వామికి ఉచిత ప్రయాణం ఉంటుందని.. అదే విధంగా ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్‌ చేసిన గురుస్వామికి ఆ బస్సులపై రోజుకు రూ.300 చొప్పున కమీషన్‌ కూడా ఇస్తామని వెల్లడించారు. కాగా శబరిమలకు వెళ్లే దారిలో ఇతర పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకునే వెసులుబాటు ఉంటుందని.. మరిన్ని వివరాలకు సమీపంలో డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆర్ఎం కోరారు.  అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ALSO READ :- గ్రేట్ కంపెనీ : ఆఫీస్ బాయ్ తో సహా కార్లు ఇచ్చిన ఓనర్