జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో కరెంట్ షాక్..

జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో కరెంట్ షాక్..

త్రిపుర ఉనాకోటి జిల్లాలో జరిగిన జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు.  కుమార్‌ఘాట్ ప్రాంతంలో సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

జూన్ 28వ తేదీ బుధవారం  కుమార్‌ఘాట్‌లో ‘ఉల్టా రథయాత్ర’ నిర్వహించారు. ఈ  వేడుకకు లక్ష సంఖ్యలో  భక్తులు తరలివచ్చారు.  ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లను రథం తాకింది. దీంతో ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. విద్యుత్‌ షాక్‌తో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి.  బాధితులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఈ విషాద సంఘటనపై సీఎం  మాణిక్‌ సాహా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి అగర్తల నుంచి కుమార్‌ఘాట్‌కు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.