లెక్క ఎక్కువైంది.. ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లపై ఆశ్చర్యం

  • సమగ్ర సర్వే లో 2,60,599 కుటుంబాలు 
  • ఇందిరమ్మ ఇండ్లకు 2,01,977 అప్లికేషన్లు
  • పన్నులు చెల్లిస్తున్న ఇండ్లే 2,06,880
  • సొంతిండ్లు ఉన్నా.. ఇందిరమ్మకు అప్లికేషన్లు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో కుటుంబాల లెక్క పొంతన కలవడం లేదు. సమగ్ర కుటుంబ సర్వేలో పేర్కొన్న కుటుంబాలు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లయ్​ చేసుకున్న కుటుంబాల సంఖ్య, పన్ను చెల్లిస్తున్న ఇండ్ల లెక్కలు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఏ ఒక్కదానికి మరొకటి పొంతన కుదరడం లేదు. ఇక మున్సిపాలిటీలోని కుటుంబాల సంఖ్య, ఇండ్ల కోసం అప్లికేషన్​ సంఖ్య చూస్తే  ఆశ్చర్య పోవాల్సిందే. 

సమగ్ర సర్వే లో 2,60,599 కుటుంబాలు 

యాదాద్రి జిల్లాలో ఇటీవలే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ముగిసింది. సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో 2,60,599 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 421 పంచాయతీల్లో 2,15,011 కుటుంబాలు ఉండగా 10,317 కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 44,248 కుటుంబాలు ఉండగా 1300 కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు. మొత్తంగా 2,59,921 కుటుంబాలు సర్వేలో పాల్గన్నాయి. 

ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,01,977 అప్లికేషన్లు

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల కోసం అప్లికేషన్లు స్వీకరించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 2,68,790 అప్లికేషన్లు ఆరు గ్యారెంటీల కోసం వచ్చాయి. ఇందులో తమకు సొంతిల్లు లేదని ఇందిరమ్మ స్కీంలో ఇల్లు కోసం 2,01,977 కుటుంబాలు అప్లయ్​ చేసుకున్నాయి. 

సొంతిండ్లు 58,622 కుటుంబాలకేనా..?

సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కుటుంబాల సంఖ్య, ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లయ్​ చేసుకున్న కుటుంబాల సంఖ్య చూసి ఆఫీసర్లు ఆశ్చర్య పోతున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో గుర్తించిన 2,60,599 కుటుంబాలు ఉంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం 2,01,977 అప్లయ్​ చేసుకున్నారు. ఇందులో మున్సిపాలిటీల నుంచి 31,750 ఫ్యామిలీలు, గ్రామ పంచాయతీల నుంచి 1,70,227 కుటుంబాలు అప్లయ్​ చేసుకున్నాయి. ఈ లెక్కన జిల్లాలో సొంతిండ్లు ఉన్న కుటుంబాలు   58,622 మాత్రమేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

పన్ను చెల్లిస్తున్న ఇండ్లే 2,06,880

అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం జిల్లాలోని 421 పంచాయతీల్లో 1,66,880 ఇండ్లు ఉన్నాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 44 వేల ఇండ్లున్నాయి. మొత్తంగా 2,06,880 ఇండ్లున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా సంఖ్యలు కన్పిస్తుండడంతో ఆఫీసర్లు ఆశ్చర్య పోతున్నారు. 

ఇండ్లున్నా.. అప్లయ్​

కాగా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక కోసం సర్వే ప్రారంభమైంది. అప్లయ్​ చేసుకున్న వారి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. ఒక్క రోజులో 2 వేలకు పైగా కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేలో ఇండ్లున్నకొందరు ఇందిరమ్మ స్కీంలో అప్లయ్​ చేసుకున్నట్టు వెల్లడైంది. వీరిలో కొందరు పాత ఇండ్లున్న కుటుంబాలు కాగా, మరి కొందరు కొత్తగా నిర్మించుకున్న ఇండ్లలో నివాసం ఉంటున్న కుటుంబాలున్నాయి.

ALSO READ : ఉమ్మడి నల్గొండలో కదులుతున్న పీడీఎస్ డొంక! ఆరుగురు అక్రమార్కుల అరెస్ట్

అయితే సొంతింట్లో ఉన్న వారి సంబంధించిన వివరాలు తీసుకున్నా.. ఇల్లు ఉన్నట్టుగా రికార్డ్​ చేస్తున్నారు. అదే విధంగా అద్దె ఇంట్లో ఉన్నప్పటికీ.. ఖాళీ స్థలం లేని వారి వివరాలు నమోదు చేసుకుంటున్నారు.   ఇంటి స్థలాన్ని జియో టాగింగ్​ ద్వారా ఫొటో తీసుకొని మొబైల్​ యాప్​లో అప్​లోడ్​ చేస్తున్నారు.