ఇంటింటి సర్వేకు సన్నాహాలు...150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ 

  • పర్యవేక్షణకు సూపర్​వైజర్ల నియామకం
  • మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి సర్వేకు అధికార యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నిర్దేశిత ప్రోఫార్మా ప్రకారం అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణన చేపట్టనున్నారు. ఈ మేరకు అవసరమైన సిబ్బంది నియామకం, సర్వే నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తుండగా సీపీవో, ఆర్డీవో లతో కలిపి కోర్ కమిటీ ఏర్పాటు చేశారు.

జిల్లాలో 21 మండలాల్లో మొత్తం 491 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 1.68 లక్షల కుటుంబాలు ఉన్నాయి. సర్వే నిర్వహణ కోసం 150 కుటుంబాలకు ఒకరి చొప్పున 1,600 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. సర్వే తీరును పర్యవేక్షించేందుకు 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్ వైజర్ ను నియమించారు.

ఈ నెల 6 నుంచి ఇంటింటి సర్వే మొదలు కానుండగా ఎన్యుమరేటర్, సూపర్​వైజర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీలో ఉన్న రిజిస్టర్ల ఆధారంగా ఇళ్ల జాబితాలు  రూపొందించి వాటి ఆధారంగా సర్వేలో కుటుంబాల వివరాలు సేకరిస్తారు. ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు నివసిస్తూ వేర్వేరుగా వంట చేసుకుంటున్నట్టయితే ఆయా కుటుంబాల వివరాలు వేర్వేరుగా నమోదు చేస్తారు. 

కలెక్టర్ స్పెషల్ ఫోకస్ 

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వే) పై కలెక్టర్ రాహుల్ రాజ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కలెక్టరేట్ నుంచి  సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దార్, ఎంపీడీవోలకు  టెలీ కాన్ఫరెన్స్ ద్వారా  సర్వే నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.  ఎన్యుమరేషన్ బ్లాకులు, సూపర్​వైజర్స్​ సరిపడినంత మందిని నియమించుకోవాలని, 10 శాతం రిజర్వ్  స్టాప్ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. మున్సిపాలిటీలలో, గ్రామాల్లో ఏ ఒక్క ఇంటిని విడిచి పెట్టకుండా అన్ని కుటుంబాల సర్వే చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో జరుగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను  కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు.  

సిద్దిపేట జిల్లాలో..  

సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు 399 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 2.38 లక్షలు కుటుంబాలు ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే కోసం ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని నోడల్ ఆఫీసర్ గా నియమిస్తున్నారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ను నియమించి నిర్దిష్టమైన బ్లాక్ మ్యాపులను అప్​డేట్​చేసి ఎన్యుమరేషన్​బ్లాక్ లను కేటాయిస్తున్నారు.

బ్లాక్ ల పర్యవేక్షణకు సూపర్​వైజర్లను నియమిస్తున్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్​వైజర్ల శిక్షణకు నియోజకవర్గానికి ఒక మాస్టర్ ట్రైనర్ ను కేటాయించారు. వీరు ఇటీవల సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో అధికారులకు అవగాహన కల్పించారు.
 

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి కుటుంబానికి సంబంధించి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ చేపట్టనున్నారు. కలెక్టర్ క్రాంతి ఇప్పటికే గ్రామాల్లో ట్రాయల్స్ మొదలుపెట్టారు. ఐదు రోజుల కింద సర్వే విషయమై మంత్రి దామోదర  రాజనర్సింహ జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్ష్యాలు, విధివిధానాలు, కార్యాచరణ గురించి వివరిస్తూ, సర్వే విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు.

ఇందులో అందరిని భాగస్వాములు చేస్తూ సర్వేను సమగ్రంగా జరిపించాలని సూచించారు. సర్వే కోసం బ్లాక్ ల వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్​వైజర్లను నియమించారు. 2011 జనాభా గణన అనుసారంగా ఎన్యుమరేషన్ బ్లాక్ లను ఏర్పాటు చేసుకోవడం, కొత్తగా ఏర్పడిన కాలనీలను బ్లాక్ ల వారీగా అప్ డేట్ చేసుకునే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 26 మండలాలకు గాను ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ గా జిల్లాస్థాయి అధికారిని నియమించనున్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్​వైజర్లకు మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇప్పిస్తున్నారు.