- మిల్లర్లను వెంటాడుతున్న కేసుల భయం
- అక్రమార్కుల విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఎమ్మెల్యేలకు సర్కార్ ఆదేశాలు
- ఉమ్మడి పాలమూరులో సీఎంఆర్ ఇవ్వని మిల్లులపై చర్యలు తప్పవంటున్న ఆఫీసర్లు
నాగర్‌కర్నూల్, వెలుగు: ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకుని ఏండ్ల తరబడి సీఎంఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన రైస్మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. డిఫాల్టర్లుగా ప్రకటిస్తూ.. క్రిమినల్ కేసులు, ఆర్ఆర్ యాక్ట్ పెట్టి రికవరీకి ప్లాన్చేస్తోంది. మిల్లర్ల విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దంటూ తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి నియోజకవర్గంలోని రైస్ మిల్లర్లతో కలెక్టర్, సివిల్ సప్లై ఆఫీసర్లతో కలిసి సమావేశం నిర్వహించారు.
వడ్లకు సరిపడా సీఎంఆర్ ఇవ్వాలని మిల్లర్లను ఎమ్మెల్యే ఆదేశించగా, జనవరి 15 తర్వాత క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ హెచ్చరించారు. త్వరలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు రైస్‌మిల్లర్లతో మీటింగులు పెట్టే అవకాశాలున్నట్లు సమాచారం. జిల్లాలో122 రైస్ మిల్లులు ఉంటే ఇందులో 70 మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించారు. వీరికి ఈసారి వడ్లు ఇవ్వడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 487 రైస్ మిల్లులు ఉంటే 274 రైస్ మిల్లులు డిఫాల్టర్ల జాబితాలోకి ఎక్కాయి. వనపర్తి జిల్లాలో సేకరిస్తున్న వడ్లను ఇతర జిల్లాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
174 మిల్లులకే వడ్లు
2019–-20, 2020–-21 సంవత్సరం యాసంగిలో ఇచ్చిన వరి ధాన్యానికి ఇప్పటికి ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద బియ్యం పెట్టని మిల్లులు 200 వరకు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 487 రైస్ మిల్లులు ఉంటే ఈ యాసంగిలో కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని కేవలం 174 మిల్లులకు మాత్రమే ఇస్తున్నారు. దాదాపు274కి పైగా మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ 21 ప్రకారం సీఎంఆర్ బకాయి మిల్లర్లను నాలుగు క్యాటగిరీల కింద విడదీసిన సివిల్ సప్లై ఆఫీసర్లు... మొదటి మూడు క్యాటగిరీల్లోని మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయిస్తున్నారు.
సదరు మిల్లర్ల నుంచి అండర్ టేకింగ్ తీసుకుని బ్యాంక్ గ్యారెంటీ వచ్చిన తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వడ్లు వెళ్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు క్యాటగిరీలలో వరి ధాన్యం సరఫరా అర్హత ఉన్న మిల్లులు 47 వరకు ఉన్నా కేవలం 19 మిల్లులు మాత్రమే అండర్ టేకింగ్,బ్యాంక్ గ్యారెంటీ సబ్మిట్ చేయడంతో వారికి మాత్రమే ధాన్యం ఇస్తున్నారు. ఒక్క నారాయణపేట జిల్లాలో మాత్రమే బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన 27 మిల్లులకు అధికారులు వడ్లు కేటాయిస్తున్నట్లు సమాచారం.
లైట్ తీసుకుంటున్న మిల్లర్లు
నవంబర్ 30 వరకు విధించిన గడవు ముగిసిన తర్వాత సీఎంఆర్ మొండి బకాయి మిల్లులపై కఠిన చర్యలు తప్పవంటూ అధికారులు పాతపాటే పాడుతున్నారంటూ మిల్లర్లు లైట్‌గా తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిల్లర్లు ఆడిండే ఆటగా సాగింది. 2022-–23 యాసంగిలో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ పెట్టకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో తనఖీలు నిర్వహించారు.
మిల్లుల్లో వరి ధాన్యం లేవని గుర్తించిన అధికారులు లేని వరి ధాన్యానికి వేలం నిర్వహించి అమ్మడానికి టెండర్లు పిలిచారు. టెండర్లు వేసిన వారు ధాన్యానికి బదులు డబ్బులు కట్టించుకునే వరకు పరిస్థితి దిగజారింది. రెండేళ్ల కిందటి వరి ధాన్యానికి సంబంధించిన లెక్కలు సరిచేయడానికి సివిల్ సప్లై అధికారులు ఇప్పటికి కుస్తీలు పడుతున్నారు.
జనవరి మూడవ వారం నుంచి క్రిమినల్ కేసులు...
సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లర్లకు గడువు పొడిగిస్తూ వచ్చిన ప్రభుత్వం ఈసారి గట్టిగానే ఝలక్ ఇచ్చింది.జనవరి 15లోగా క్లియర్ కాకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అనుమతించింది. సీఎంఆర్ విషయంలో గత ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేయడంతో లైట్‌గా తీసుకున్న మిల్లర్లు పెండింగ్ సిఎంఆర్ పెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు.