పన్నుల వసూలు వెరీ స్లో..!మార్చి నాటికి టార్గెట్​ పూర్తయ్యేనా?

  • అధికారులు ఒత్తిడి చేస్తున్నా ప్రజల నుంచి స్పందన కరువు
  • జనగామ జిల్లాలో ఇప్పటి వరకు వసూలైంది  38 శాతం మాత్రమే..

జనగామ, వెలుగు : గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు స్లోగా జరుగుతున్నాయి. అధికారులు ఒత్తిడి చేస్తున్నా ప్రజల నుంచి స్పందన కరువైంది. జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 38 శాతం పన్నులు వసూలు కాగా, మార్చి 31 వరకు 100 శాతం వసూలే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు.

టార్గెట్ రూ 6.46 కోట్లు..

జనగామ జిల్లాలో 12 మండలాలుండగా, వీటి పరిధిలో 281 గ్రామ పంచాయతీలున్నాయి. సుమారు 1,46,428 ఇండ్లు ఉన్నాయి. వీటిలో ఇంటి, నల్లా, ఇతర పన్నుల రూపంలో రూ. 6,46,77,081ల వార్షిక ఆదాయం రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పన్నుల వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ, ప్రజలు పన్నులు కట్టేందుకు ముందుకు రాకపోవడంతో వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. 

దీనికి తోడు ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా తరచూ పంచాయతీ సిబ్బందికి ఇతర పనుల కోసం ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. ఎల్ఆర్ఎస్, ఇందిరమ్మ ఇండ్ల సర్వే తదితర పనులకు ప్రాధాన్యత ఇస్తుండడంతో పన్నుల వసూళ్లలో జాప్యం జరుగుతోందని పలువురు అంటున్నారు.  

టార్గెట్​ఎక్కువ.. వసూళ్లు తక్కువ.. 

జనగామ జిల్లా టార్గెట్ రూ 6.46 కోట్ల పై చిలుకుండగా, ఇప్పటి వరకు రూ.2,51 ,11,704 లు మాత్రమే అంటే 38.83 శాతం పన్నులు వసూలయ్యాయి. ఇంకా రూ.3,95,65,377 వసూలు కావాల్సి ఉంది. అత్యధికంగా కొడకొండ్ల మండలంలో రూ.42,41,357 వసూలు కావాల్సి ఉండగా, రూ.28,74,581 వసూలయ్యాయి. అత్యల్పంగా దేవరుప్పులలో రూ.33,41,664 టార్గెట్​ కాగా, రూ.66,550 మాత్రమే వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. బచ్చన్నపేట మండలంలో రూ 77,73,187టార్గెట్​ కాగా, రూ 21,95,235 వసూలు అయ్యాయి. 

చిల్పూరు మండలంలో రూ 61,19,025 లకు, రూ 25,01,312, స్టేషన్​ ఘన్​పూర్​లో రూ.65,83,477లకు, రూ.22,63,462, జనగామ రూరల్​లో రూ 34,05,668 లకు, 15,49,804లు, లింగాల ఘన్​పూర్​లో రూ.42,59,126కు, రూ.20,45,612 వసూలయ్యాయి. నర్మెటలో రూ.26,74,765లకు రూ.13,90,227లు, పాలకుర్తిలో రూ.40,27,130లకు 22,03,360, రఘనాథపల్లిలో రూ.1,15,84,086కు రూ.4545455లు, తరిగొప్పులలో రూ.23,97,929కు రూ.13,70,070, జఫర్​ఘడ్ మండలంలో రూ.36,88,376లకు రూ.15,07,536 వసూలయ్యాయి.​

వసూళ్లకు ప్రత్యేక చర్యలు 

పంచాయతీల పరిధిలోని పన్నుల వసూళ్లకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తున్నాం. మార్చి నెలాఖరు వరకు 100 శాతం టార్గెట్​ రీచ్​ అయ్యేలా ముందుకు సాగుతున్నాం. ప్రజలు పన్నులను చెల్లించి సహకరించాలి. - నాగపురి స్వరూప, డీపీవో, జనగామ