- ఏడాది సేల్స్ రూ.33,811 కోట్లు
- మద్యం అమ్మకాల్లో వ్యాట్ రూపంలో సగానికిపైగా రాష్ట్ర ప్రభుత్వానికే
చెన్నై: కరోనా సమయంలోనూ మద్యం అమ్మకాల్లో తమిళనాడు రికార్డు సృష్టించింది. మామూలు రికార్డు కాదు.. చరిత్ర సృష్టించే రికార్డు. మూడు నాలుగు నెలలకుపైగా మూతపడినా.. అమ్మకాలు రాకెట్ వేగంతో జరిగి 33వేల 811 కోట్లకు చేరింది. గత మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరం గణాంకాలు వెల్లడి కావడంతో ఈ రికార్డు సేల్స్ బయటకొచ్చింది.
తమిళనాడులో మద్యం దుకాణాల నిర్వహణను 2002లో ప్రభుత్వం చేపట్టింది. ఆ ఏడాది మద్యం అమ్మకాలు రూ. 2,800 కోట్లుగా నమోదైంది. తాజాగా ఇపుడు మద్యం అమ్మకాలు అనేక రెట్లు పెరిగి 33వేట కోట్లను దాటడం గమనార్హం. గత మార్చితో ముగిసిన ఏడాదిలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ దుకాణాలు (తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ -టీఏఎస్ఎంఏసి) మొత్తం రూ. 33,811 కోట్లు విలువైన మద్యాన్ని అమ్మాయి. తమిళనాడులో చరిత్రలోనే ఇది రికార్డు. ఈ సేల్స్ వెనుక విచిత్రమేమిటంటే ఇదే ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది మార్చి, జూన్ నెలలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అటు తర్వాత కూడా సెకండ్ వేవ్ రావడంతో 5 లేదా 6 వారాలు మద్యం దుకాణాలకు బంద్ పడింది. వరుసగా ఇన్ని రోజులు మద్యం దుకాణాలు మూసినా అమ్మకాలు ఆకాశానికి ఎగబాకే రీతిలో సాగాయి.
మద్యం అమ్మకాల్లో సగానికిపైగా రాష్ట్ర ప్రభుత్వానికే
మద్యం అమ్మకాల్లో సగానికిపైగా అంటే కనీసం 50 నుంచి 60 శాతం వరకు వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇతర పన్నులు అవీ ఇవీ కలుపుకుంటే ఏడాది తమిళనాడులో 20వేల కోట్లకుపైగా ప్రభుత్వ ఖజానాకు తిరిగి వస్తాయని ఒక అంచనా. గతంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత హయాంలో దశలవారీగా మద్య నిషేధం అమలు చేశారు. నిషేధంలో భాగంగా 500కుపైగా మద్యం దుకాణాలను మూసేసినా తర్వాత అమలు చేయలేక ఎత్తేశారు. అటు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మద్య నిషేధం ఊసే ఎత్తడం లేదు.
