ఎవరి కోరిక సామీ: ప్రశాంత్ కిషోర్‎తో అల్లు అర్జున్ భేటీ..!?

= పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా..?
= ముందు సోషల్ సర్వీస్ చేయాలన్న ప్రశాంత్ కిషోర్
= సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ

హైదరాబాద్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‎తో ప్రముఖ హీరో అల్లు అర్జున్ రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? అన్న చర్చ మొదలైంది. ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి తరఫున ఆయన ప్రచారం చేశారు. శిల్పా రవిచంద్ర బన్నీకి మిత్రుడు. ఈ నేపథ్యంలో బన్నీ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వెళ్లి ప్రచారం చేశారు. దీనిపై మెగా ఫ్యామిలీ భగ్గుమంది.  ఆ తర్వాత రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగింది. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బన్నీపై ట్రోల్స్ పెరిగాయి. ఒక దశలో  పుష్ప–2 విడుదలపైనా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తర్వాత పుష్ప–2 రికార్డుల మోత మోగిస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నార్త్‎లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే తరుణంలో ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‎తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పీకే బన్నీకి సూచించినట్టుగా తెలుస్తోంది.