Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!

తెలంగాణలో కూడా తిరుపతి ఉంది. ఎత్తైన కొండ మీద.. పరవశింపజేసే ప్రకృతి మధ్య.. వెంకటేశ్వరస్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ నమ్మిన వాళ్లకు కొంగుబంగారమై విరాజిల్లుతున్నాడు. ఈ దేవాలయం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండడం వల్ల దీన్ని 'పాలమూరు తిరుపతి' అని పిలుస్తారు.

చుట్టూ ఎత్తైన కొండ. ప్రశాంతమైన వాతావరణం. భక్తుల మనసు కట్టిపడేసే స్వచ్ఛమైన ప్రకృతి మధ్య కొలువుతీరి కనిపిస్తాడు. శ్రీ వెంకటేశ్వరస్వామి. గుట్ట దిగువన అమ్మవారు.. అలివేలు మంగతాయారు దర్శనమిస్తారు. అంతేకాదు ఈ ఆలయ ప్రాంగణంలో తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహాలు ప్రత్యేకం.. 
ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉందని స్థానికులు చెప్తున్నారు. 

తమిళనాడులోని శ్రీరంగ పట్టణానికి సమీపంలో అళహరి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న కేశవయ్యకు వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి 'మన్యంకొండపై నేను వెలిశాను. నువ్వు వెళ్లి రోజూ పూజలు చేయమని చెప్పాడట. స్వామి మాట ప్రకారం కేశవయ్య తన కుటుంబ సభ్యులతోవచ్చి, ఈ కొండకు దగ్గర్లో ఉన్న కోటకదిరిలో నివాసం ఏర్పరచుకున్నాడు. రోజూ గుట్టపైకి వెళ్లి స్వామివారిని పూజించేవాడు. 

ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేస్తున్నకేశవయ్యకు స్వామివారి విగ్రహం చేతిలో ప్రత్యక్షం అయ్యిందట. దాన్ని తీసుకొచ్చి మన్యం గుహలో పెట్టి రోజూ పూజలు చేయడం. ప్రారంభించాడని స్థానికులు చెప్తారు. ఆ తర్వాత ఈ కొండమీద ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇది జరిగి ఆరువందల ఏళ్లు అయింది. ఆ తర్వాత అళహరి వంశానికి చెందిన వాళ్లు కొందరు ఈ స్వామి గురించి మూడువందల కీర్తనలు రచించారు.

కథ  

ఈ ఆలయం గురించి స్థానికుల్లో మరోకథ ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక పెద్దావిడ ప్రతి ఏడాది తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని వస్తుండేది. వయసు పెద్దదైపోవడంతో ఒకసారి తిరుపతి వెళ్లి వస్తూ 'స్వామీ! ఇంతదూరం నేను నీ దర్శనానికి రాలేకపోతున్నాను. మా ప్రాంతంలో ఎక్కడైనా కనిపించు' అని వేడుకుంది. అప్పుడు వెంకటేశ్వరస్వామి ఆమె కోరిక మేరకు మన్యంకొండలో స్వయంభుగా వెలిశాడు. అప్పటి నుంచి ఆమె మన్యంకొండలోని వెంకటేశ్వరస్వామిని పూజించేది.

అమ్మవారు

కొన్నేళ్ల తర్వాత అళహరి వంశానికే చెందిన రామయ్యకు వెంకటేశ్వరస్వామి కలలో కనిపించి, అమ్మవారిని కూడా మన్యంకొండలో ప్రతిష్ఠించమని చెప్పాడట. దాంతో 1958లో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి రామయ్య కొండ దిగువన ప్రతిష్ఠ చేశాడు. అప్పటి నుంచి భక్తులు అలివేలు మంగతాయారు సన్నిధిలోనే తమ ముడుపులు చెల్లించుకుంటారు. వివాహాలు  చేసుకుంటారు. 

ఈ అమ్మవారిని దర్శించుకుని, ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నవాళ్లకు సంతానం. సంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు ముత్తయిదువులుగా జీవిస్తారని కూడా నమ్మకం. అందుకే సంతానం లేనివాళ్ళు. అమ్మవారిని ఎక్కువగా దర్శించుకుంటారు. పూజలు చేసి తమ కోర్కెలు తీర్చమని ప్రార్థిస్తుంటారు.

 పోలికలున్నాయి. 

 మన్యంకొండలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయానికి, తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి పోలికలు ఉన్నాయి. తిరుపతి
నుంచి తిరుమలకు మెట్లదారి. ఘాట్ రోడ్... రెండు మార్గాల ద్వారా వెళ్లొచ్చు. అలాగే ఈ దేవాలయానికి కూడా మెట్ల మార్గం, రోడ్డు మార్గం ఉన్నాయి. భక్తులు ఈ రెండు మార్గాల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమలలో ఎలా వెంకటేశ్వరుని పాదాలను భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారో, మన్యంకొండలో కూడా అలాగే స్వామివారి పాదాలను పూజిస్తారు. తిరుమలలో ఏడు కొండలు ఉంటే, ఇక్కడ స్వామివారిని చూడాలంటే ఏడు ద్వారాల గుండా వెళ్లాలి. మన్యంకొండలోని వేంకటేశ్వరస్వామికి కూడా భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

సంప్రదాయం

ఒకప్పుడు గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు ఇక్కడకు వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించేవాళ్లట. ప్రస్తుతం ఇక్కడ ప్రతి శనివారం తిరుచ్చిసేవ, పౌర్ణమిరోజు వెంకటేశ్వరస్వామి కల్యాణమహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో కనిపించే మరో ఆచారం ఏంటంటే.. భక్తులు కొత్తకుండలో అన్నం, పులుసు వండి.. దాసరులతో పూజలు చేయించి స్వామివారికి ప్రసాదంగా సమర్పిస్తారు.

పేరు ఎలా వచ్చిందంటే..!

వందల ఏళ్ల కిందట ఈ కొండపై మునులు తపస్సు చేశారు. అందువల్లే ఈ కొండకు
మునులకొండ, మన్యంకొండ అనే పేరు వచ్చిందని స్థలపురాణం వల్ల తెలుస్తోంది. తిరుపతికి వెళ్లలేని భక్తులు ఇక్కడకు వచ్చి, స్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటారు. తిరుపతికి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో, ఇక్కడకు వచ్చినా అంతే పుణ్యం దక్కుతుందని ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకం.

ఎట్లా వెళ్లాలి?

మహబూబ్ నగర్ కు 20 కి.మీ. దూరంలో ఉంది ఈ మన్యంకొండ. కర్నాటక.. రాయచూర్ వెళ్లే జాతీయరహదారి నుంచి నాలుగు కి.మీ. దూరం లోపలకు వెళ్తే ఈ గుడి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి మన్యంకొండకు నేరుగా బస్సులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వెళ్లాలనుకుంటే మహబూబ్ నగర్ వెళ్లి, అక్కడ నుంచి మన్యంకొండకు వెళ్లడం సులభం, రైలు మార్గం గుండా వెళ్లాలనుకునే వాళ్లు మహబూబ్ నగర్, దేవరకద్ర మధ్య ఉన్న కోటకదిర రైల్వేస్టేషన్లో దిగితే.. అక్కడ నుంచి ఈ మన్యంకొండ ఐదు కిలోమీటర్లే. అయితే కోటకదిరలో కేవలం పాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి.