పోఖ్రాన్ లో హెలికాప్టర్ నుంచి మిసైల్ టెస్ట్
న్యూఢిల్లీ: శత్రుదేశాల రాకెట్ దాడులకు చిక్కకుండా కాస్త దూరం నుంచి పేల్చినా నేరుగా వెళ్లి యుద్ధట్యాంకులను పేల్చేసే మిసైల్‌ను డీఆర్డీవో, నేవీ శనివారం విజయవంతంగా పరీక్షించాయి. స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్(శాంట్)గా పిలిచే ఈ మిసైల్‌ను శనివారం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ పర్వతాల్లో పరీక్షించినట్లు తెలిపింది. ఈ టెస్టులో శాంట్ మిసైల్ అన్ని రకాలుగా సక్సెస్ అయిందని రక్షణ శాఖ ప్రకటించింది. ‘‘శాంట్ మిసైల్ అన్ని పరీక్షల్లో పాస్ అయింది. రిలీజ్ మెకానిజం, అడ్వాన్స్డ్ గైడెన్స్, ట్రాకింగ్, సాఫ్ట్ వేర్ వంటి అన్ని వ్యవస్థలు బాగా పనిచేశాయి” అని తెలిపింది. ఈ మిసైల్‌ను డీఆర్డీవోకు చెందిన పలు ల్యాబ్‌లు, ఇండస్ట్రీలతో కలిసి హైదరాబాద్‌లోని రీసె ర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతోనే అభివృద్ధి చేసింది. ఇది10 కి.మి.దూరంలోని టార్గెట్లను పేల్చివేయగలదు. హెలికాప్టర్ ద్వారా సురక్షితమైన దూరం నుంచే టార్గెట్‌ను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసంచేసేలా ఈ మిసైల్ లో అధునాతనమైన మిల్లీమీటర్ వేవ్ సీకర్ను అమర్చారు.
స్వదేశీ టెక్నాలజీతో..
శాంట్ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్, స్టాండ్ ఆఫ్ వెపన్స్ తయారీ దిశగా మరో కీలక ముందడుగు పడిందని రక్షణ శాఖ పేర్కొంది. మిసైల్ అభివృద్ధి, ప్రయోగంలో పాల్గొన్న సైంటిస్టులు, అధికారులను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. స్వదేశీ టెక్నాలజీతోనే వెపన్స్ తయారీకి ఈ పరీక్షతో మరింత ఊతం లభిస్తుందని డీఆర్డీవో చైర్మన్ జి. సతీశ్ రెడ్డి అన్నారు. కాగా, శత్రువుల వెపన్స్ కు చిక్కకుండా, తగినంత దూరంలో నిలిచిపోయే హెలికాప్టర్ల ద్వారా ప్రయోగించే మిసైల్స్ ను, బాంబులను స్టాండ్ ఆఫ్వెపన్స్ గా పిలుస్తుంటారు. గత కొన్నిరోజుల్లో స్టాండ్ ఆఫ్వెపన్ పరీక్షను విజయవంతంగా చేపట్టడం ఇది మూడోసారి. ఇంతకుముందు లాంగ్ రేంజ్ బాంబు, యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్స్ ను పరీక్షించారు.
