Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం

చుట్టూ కొండలు.. పచ్చని అటవీ ప్రాంతం... కనువిందు చేసే అందమైన జలపాతాలు.. బయ్యారం అడవులు సొంతం. బయ్యారంలోని మిర్యాలపెంటలో సహజ సిద్ధంగా పాండవుల గుట్టపై ఏర్పడిన ఏడుబావుల జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఒక బావి నుంచి మరో బావిలోకి ప్రవహిస్తున్న నీటితో ఈ బావులు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

సహజ సిద్ధంగా.. ఎత్తైన గుట్టల నడుమ.. దట్టమైన అభయారణ్యంలో అద్భుత జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన శ్రేణుల పైనుంచి ఏడు వరుసలుగా పారుతున్న నీరు జలపాతాలుగా ఆవిష్కృతమై ఆహ్లాదాన్ని పంచుతుంది. బయ్యారం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆగ్రాప్పేట, కంబాలపల్లి మీదుగా మిర్యాలపెంటకు చేరుకోవాలి. అక్కడ నుంచి కొద్ది దూరం నడిస్తే ఏడు బావులు దర్శనమిస్తాయి. 

గుట్టల పైభాగాన ఒక బావి నుంచి మరో బావి, ఆ బావి నుంచి ఇంకో బానికి జలధార పరవళ్లు తొక్కుతోంది. ఒకదాని తర్వాత ఒకటి.. వరుసగా ఉండటం, గుట్టపై నుంచి ప్రవహించే ప్రవాహం వల్ల ఆయా ప్రదేశాల్లో రాతిపొరలు కోతకు గురై ఏడు బావులుగా ఏర్పడ్డాయనే అభిప్రాయం ఉంది. పరవళ్లు తొక్కుతూ నీళ్లన్నీ సెలయేరులా ఏర్పడి కనువిందు చేస్తాయి.

ఇక్కడి అడవి అందాలు, పక్షుల కిలకిల రావాలు, అరుదైన వన్యప్రాణులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ ఏడు బావుల్లోకి నీరు ఎక్కడ్నించి వచ్చి చేరుతుందనేది ఇప్పటికీ రహస్యమే. దేవతలకాలంలో పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ బావులను తవ్వించినట్లు, అందులో స్నానాలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఏడు బావుల్లో వర్షపు నీరు వచ్చి చేరినా.. కలుషితం కాదు. స్వచ్ఛమైన పాలలాంటి నురగలను తలపిస్తాయి. 

ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే తెలంగాణ నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. నీటి అందాలను తిలకించి మైమరిచిపోతుంటారు. ఈ ఏడు జలపాతాల్లో ఐదు జలపాతాలు వంద అడుగులకు పై నుంచి కిందకు పడుతూ కనువిందు చేస్తున్నాయి. సుమారు 900 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు కిందికి పడుతుంటాయి. వీటిని చూడాలంటే పర్యాటకులు పర్వతాన్ని అధిరోహించక తప్పదు. సుమారు నాలుగు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో కాలిబాటన ప్రయాణిస్తే ఈ జలపాతాలు కనిపిస్తాయి.