ఒక్కోపనికి ఒక్కోరేటు సత్తుపల్లి రవాణాశాఖ ఆఫీస్​లో కొత్త రూల్స్

  • ఇన్ స్పెక్షన్​ రిపోర్ట్  పేరిట ప్రత్యేక వసూళ్లు 
  • రెండు నెలల్లో రెండుసార్లు వసూళ్ల రేట్ల పెంపు 
  • ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లు

సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా రవాణా శాఖలో సత్తుపల్లి కార్యాలయం ఎప్పుడూ వివాదాస్పదమే. రెండేళ్ల కింద నకిలీ ఆధార్ కార్డు, నకిలీ ఇన్సూరెన్స్ లతో ఏజెంట్ లు చేసిన దందా కాస్త ఏసీబీకి చేరడంతో సత్తుపల్లి ఆర్టీవో ఆఫీస్​ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి ఫైల్స్ సీజ్ చేశారు. అప్పుడు క్లర్క్ గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని సస్పెండ్ కూడా చేశారు. ఇంత జరిగినా ఆ తర్వాత ఈ కార్యాలయ అధికారుల తీరులో ఏ మాత్రం మార్పురాలేదు. ఏజెంట్ల వ్యవస్థ ద్వారా ఫైళ్లను నడిపిస్తున్నారు.

 వీరికి తోడు ఇక్కడ పనిచేస్తున్న మోటార్​ వెహికల్ ఇన్​ స్పెక్టర్​ (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్​ వెహికల్ ఇన్​స్పెక్టర్​ (ఏఎంవీఐ) ఇద్దరు నుంచి ముగ్గురు ప్రైవేట్ అసిస్టెంట్లను ఏర్పాటు చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్​ కు సరిహద్దు ప్రాంతం కావడంతో రోజూ అక్కడి నుంచి వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఏపీతోపాటు ఇతర రాష్ర్టాల వాహనాల పర్మిట్లను చెక్​ చేసే పేరిట భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. 

తలలు పట్టుకుంటున్న ఏజెంట్లు 

సత్తుపల్లి  రవాణా కార్యాలయంలో అక్రమ వసూళ్లకు అంతులేకుండాపోయింది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్​ చేశారు. రెండు నెలల్లోనే రెండుసార్లు మాముళ్లను పెంచారు. ఏ పనికి ఎంత ఇవ్వాలో ఎంవీఐ తమ సహాయకుల ద్వారా అనధికారిక సర్కులర్​ జారీ చేశారు.  వాహనదారుల నుంచి భారీగా వసూళ్లు చేయడం తలకు మించిన భారంగా మారిందంటూ ఏజెంట్లు తలలు పట్టుకుంటున్నారు. భారీ వసూళ్లు చేయలేమని అంటే ఆఫీసును కల్లూరుకు మారుస్తామని ఏజెంట్లను భయపెడుతున్నారు. 

రాష్ట్రంలోనే ఇక్కడ ప్రత్యేక దరఖాస్తు.. 

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇతర రాష్ట్రాల వెహికల్స్ ట్రాన్స్ఫర్ (ఓఎస్​)కి ఇన్స్​పెక్షన్​పేరిట ఓ ప్రత్యేక దరఖాస్తును రూపొందించి రూ.500 నుంచి  రూ.3వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఆ తరువాత ట్రాన్స్​ఫర్​ కోసం మళ్లీ ఇంకో రోజు కార్యాలయానికి వెళ్లినప్పుడు ప్రభుత్వానికి చెల్లించే చలానాతో పాటుగా వాహన సామర్థ్యాన్ని బట్టి రూ.500 నుంచి రూ.2వేల వరకు మామూళ్లు సమర్పించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.

 ఇక ఆటో, కారు, లారీ వాహనం ఏదైనా సరే ఓనర్​ కు డ్రైవింగ్ వస్తేనే రిజిస్ట్రేషన్​ చేస్తామంటూ ఇక్కడ కొత్త రూల్ పెట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్​ ను పెట్టుకొని వాహనాన్ని నడిపించుకుంటామని చెబుతున్నా, లైసెన్స్ కు దరఖాస్తు చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కేసుల స్థానంలో కాసులు!

ఇక్కడి అధికారులు తన సన్నిహిత ప్రైవేట్ సైన్యంతో చెకింగ్​లు చేయిస్తూ కేసుల స్థానంలో కాసులు దండుకుంటున్నారని పలువురు వాహనదారులు వాపోతున్నారు. 
ఈనెల 2న ఇసుక ట్రాక్టర్​ (ఏపీ 39 టీఆర్​ 2,535) సత్తుపల్లి వస్తుండగా​కాకర్లపల్లి రోడ్డు దగ్గర రవాణా శాఖ అధికారి పట్టుకున్నారు. అగ్రికల్చర్​ వాహనాన్ని కమర్షియల్ గా వాడుతున్నారని, కేసు రాస్తామని చెప్పడంతో రూ.5 వేలు ఇచ్చి ట్రాక్టర్​యజమాని సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలిసింది. గత డిసెంబర్​ 19న సత్తుపల్లిలో ఒక రిసెప్షన్​ కోసం విజయవాడ నుంచి వచ్చిన బస్సును ఆపి,తెలంగాణ బోర్డర్​ పర్మిట్ లేదని, కేసు రాయాలంటూ బెదిరించారు. ఆ తర్వాత సెటిల్మెంట్ చేసుకుని బస్సును వదిలేశారు. 

ఏజెంట్ల నుంచి వసూళ్లు చేయట్లేదు..

సత్తుపల్లి రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో ఏజెంట్ నుంచి ఎటువంటి వసూళ్లు చేయడం లేదు. వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇతర రాష్ట్రాల వాహన రిజిస్ట్రేషన్లలో ఇన్స్​పెక్షన్​ కోసం ప్రత్యేకంగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్స్​పెక్షన్​ చేసి ఫైల్ ఖమ్మం పంపుతాం. – జొన్నలగడ్డ శ్రీనివాస్, ఎంవీఐ, సత్తుపల్లి