డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు : కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు పోలీస్, ఆబ్కారీ శాఖతో కలిసి బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో  ‘నషా ముక్త్ భారత్ పఖ్వాడా’  కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత డ్రగ్స్​ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

డ్రగ్స్ నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు  సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్​ మీటింగ్​లో డ్రగ్స్​ నిర్మూలనపై  చర్చించాలన్నారు. ఎస్పీ చెన్నూరి రూపేశ్,  డీఎల్ఎస్​ఏ సెక్రటరీ రమేశ్, అడిషనల్​ కలెక్టర్ మాధురి, ఎక్సైజ్ కమిషనర్ నవీన్ చంద్ర, డిఎంహెచ్​వో గాయత్రి దేవి, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు..

కంది: జిల్లాలో నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. కలెక్టరేట్ లో సీడీపీఓలు, వైద్య శాఖ అధికారులతో  ప్రపంచ తల్లి పాలవారోత్సవాలపై మీటింగ్ నిర్వహించారు. అంగన్ వాడీ సెంటర్లు, సబ్ సెంటర్స్, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, ప్రభుత్వ,  ప్రైవేట్ ఆసుపత్రుల్లో తల్లి ప్రాముఖ్యతను వివరించాలని ఆదేశించారు. డీఎంహెచ్​వో గాయత్రీదేవీ, డీపీవో సాయిబాబా, డీడబ్ల్యూవో లలిత కుమారి, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

హాస్పిటల్‌ను సిద్ధం చేయండి

సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ఎన్సాన్‌పల్లిలో నిర్మిస్తున్న వెయ్యి పడకల హాస్పిటల్‌ను అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు వీలుగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఎం.మను చౌదరి ఆదేశించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కిశోర్‌‌కుమార్‌‌, ఇంజినీర్లతో కలిసి హాస్పిటల్‌ గదులను పరిశీలించారు.  అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా సిద్ధం చేయాలన్నారు. మంజూరైన డాక్టర్లు, వైద్య సిబ్బందిలో ఎంతమంది పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టరేట్ లో పాఠశాల అభివృద్ది పనులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 804  ప్రభుత్వ స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మరుగుదొడ్లు, తాగునీరు,  మైనర్ రిపేర్లు, కిచెన్ షెడ్ లు, కాంపౌండ్ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు తదితర పనులు చేపట్టినట్లు చెప్పారు. వీటిలో ఇప్పటివరకు 724 స్కూళ్లలో పనులు పూర్తి కాగా మిగిలిన 80 స్కూళ్లలో పెండింగ్ పనులను  15లోగా పూర్తి చేయాలన్నారు.

అర్హులైన రైతులందరికీ రుణమాఫీ

మెదక్​ టౌన్: జిల్లాలోని అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని మెదక్ కలెక్టర్ ​రాహుల్​రాజ్ తెలిపారు. మెదక్ ​మండలం ర్యాలమడుగులో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. సాంకేతిక, ఇతర కారణాలతో రుణమాఫీ కాని వారు స్థానిక అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టరేట్​లోనిగ్రీవెన్స్ సెల్​​లో సంప్రదించవచ్చన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాలు, అంగన్​వాడీ సెంటర్​ను తనిఖీ చేశారు.

సీఎంతో సమావేశానికి ఏర్పాట్లు చేయాలి 

సీఎంతో ప్రమోషన్లు పొందిన టీచర్ల సమావేశానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. కలెక్టరేట్​లో  విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే మీటింగ్​కు జిల్లాలో ప్రమోషన్లు పొందిన టీచర్లంతా హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. టీచర్లకు సమాచారం అందించి, రూట్​మ్యాప్ ఇవ్వాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఈవో రాధాకిషన్ 
పాల్గొన్నారు.