సిద్దిపేటలో కల్తీ పాల కలకలం..

అమ్మకాలపై లోపిస్తున్న పర్యవేక్షణ
వేడిచేస్తే ముద్దలుగా, పసుపు రంగులోకి  మారుతున్న పాలు
తనిఖీలు లేక ఇష్టారాజ్యంగా అమ్మకాలు
పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు 

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేటలో కల్తీ పాల విక్రయాలు ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. ఇటీవల వేడిచేస్తే ముద్దలుగా కావడం, పసుపు రంగులోకి మారడం, తీగలాగ సాగుతున్నాయి.  ఏడాది క్రితం లూజ్ పాల​అమ్మకాల్లో కల్తీ చేసిన సంఘటనలు వెలుగు చూశాయి.

రెండు రోజుల క్రితం సిద్దిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముండే వ్యక్తి డబ్బా పాలను కొనుగోలు చేసి వేడి చేయగా.. తీగలుగా, ముద్దలుగా మారాయి. దీంతో అనుమానం వచ్చి వ్యాపారిని ప్రశ్నిస్తే వాటిని వ్యక్తి తనకేమీ తెలియదని తప్పించుకున్నాడు. 

రూటు మార్చిన పాల అమ్మకందార్లు

ప్యాకెట్ పాలు మంచివి కావనే అభిప్రాయంతో ప్రజలు డబ్బా పాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని అలుసుగా చేసుకుని కొందరు రూటు మార్చి పాల ప్యాకెట్లు కొని డబ్బాలో పోసి  నీళ్లతో పాటు ఇతర పదార్థాలను కలిపి గేదె పాలను అమ్ముతున్నట్లు కొనుగోలుదారులను నమ్మిస్తున్నారు.

పాలల్లో చిక్కదనం కోసం పాలపొడితో పాటు ఇతర పదార్థాలు కలుపుతున్నారు. ఈ పాలను వేడిచేసే సమయంలో అవి పసుపు రంగులోకి , ముద్దగా మారుతున్నాయి.  సిద్దిపేట పట్టణంలో ఇటీవలి కాలంలో లూజ్ పాల అమ్మకం విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు వ్యాపారులు ఇలాంటి అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు.  

అధికారుల తనిఖీలు శూన్యం 

పాల అమ్మకాలపై అధికారులు తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడం వ్యాపారులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.  నిత్యం తనిఖీలు చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ అధికారి లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో కల్తీ పాల అమ్మకాలపై నియంత్రణ లేకుండా పోయింది.  

ఏడాది క్రితం పట్టణంలోని రెండు ప్రాంతాల్లో లూజ్ పాల శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. కానీ వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటీవల కల్తీ పాల సంఘటనలపై  సిద్దిపేట వినియోగదారుల సంఘం నేతలు మున్సిపల్  కమిషనర్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు.  

పనిచేయని ఆహార సలహా సంఘాలు

ఆహార పదార్థాల కల్తీని నియంత్రించడానికి చర్యలు తీసుకునే ఆహార సలహా సంఘాలు సక్రమంగా పని చేయడం లేదు. ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించి కల్తీ మోసాలను అరికట్టడానికి  అధికారులతో సమావేశాలు నిర్వహించాలి.  కానీ ఇలాంటి సమావేశాలు జరగకపోవడంతో కల్తీ పాల అమ్మకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి.

మున్సిపాల్టీలో ప్రత్యేక అధికారి లేకపోవడం, సిద్దిపేట జిల్లాకు ఇన్‌‌చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి ఎవరో తెలియకపోవడంతో పలు సంఘటనలు ఇంకా  వెలుగులోకి రావడం లేదు.

కల్తీ ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆహార పదార్థాల కల్తీ ఘటనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.  సిద్దిపేటలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి.  ఫుడ్ సేఫ్టీ అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇటీవల కల్తీ పాల విషయంపై ఫిర్యాదు చేసే విషయంలో వినియోగదారుల సంఘం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చివరకు మున్సిపాల్టీ ఇన్ వార్డులో ఫిర్యాదు చేశాం.‌‌‌‌- కాజీపేట సత్యనారాయణ, సిద్దిపేట వినియోగదారుల సంఘం అధ్యక్షుడు