సోలార్ ఎనర్జీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు

సోలార్ ఎనర్జీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
  • వ్యాహాత్మకంగా అడుగులు వేస్తున్న రిలయన్స్
  • ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలిచే చర్యలకు శ్రీకారం

ముంబయి: దేశంలో అగ్రగామి సంస్థగా ఎదిగిన రిలయన్స్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో అగ్రగామి కంపెనీగా ఎదిగే దిశలో అడుగులు వేస్తోంది. భావి తరాల భవిష్యత్తుపై బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న రిలయన్స్ తాజాగా ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలిచే చర్యలకు శ్రీకారం చుడుతోంది. 2035 నాటికి నికర కార్బన్ ఉద్గారాలు సున్నాగా మార్చడానికి 15 సంవత్సరాల ప్రణాళికను గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు శతాబ్దాలుగా ఆర్ధిక వృద్ధిని  సాదించిన పెట్రో ఉత్పత్తుల వయసు ఇక ఎక్కువ కాలం కొనసాగదని ఆయన భవిష్యత్తును ఊహించి చేసిన ప్రకటనకు ఈ ఏడాది కార్యరూపంలోకి తెస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో సోలార్ ఎనర్జీ.. సోలార్ ఫోటో వోల్టాయిక్, ఫ్యూయెల్ సెల్స్,  గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ బ్యాటరీల తయారీకి నాలుగు గిగా కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి 75 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయించినట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. గురువారం జరిగిన ఏజీఎం సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారాయన. 
కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ 100 గిగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారం నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. పర్యావరణం గొప్పదనం కరోనా మనకు కొత్త పాఠాలు నేర్పిందని ప్రస్తావించిన ఆయన కొత్త ఇంధన పర్యావరణ వ్యవస్థ, క్లిష్టమైన భాగాలను తయారు చేయడానికి నాలుగు గిగా కర్మాగారాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. వీటిలో 60 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని.. భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలలో అదనంగా రూ .15 వేల కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. కొత్త ఇంధన రంగ వ్యాపారంలో  మొత్తం పెట్టుబడి 3 ఏళ్ల కాలంలో 75 వేల కోట్లు అవుతుందని ముఖేష్ అంబానీ వివరించారు.