యాక్సిస్ బ్యాంకుకు 5కోట్ల ఫైన్ వేసిన ఆర్బీఐ

యాక్సిస్ బ్యాంకుకు 5కోట్ల ఫైన్ వేసిన ఆర్బీఐ
  • నిబంధనలను పాటించడంలేదంటూ ఆగ్రహం.. విచారించి నిగ్గు తేల్చిన ఆర్బీఐ

న్యూఢిల్లీ: బ్యాంక్ నిబంధనలు, మార్గదర్శకాలను తోసిరాజంటున్న యాక్సిస్ బ్యాంకుపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. క్షమించరాని తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ చర్యలకు ఉపక్రమించింది. దేశంలో కొన్ని ప్రైవేటు బ్యాంకులు నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నాయన్న ఆరోపణల నేపధ్యంలో ఎట్టకేలకు ఆర్బీఐ స్పందించినట్లు కనిపిస్తోంది. 
బ్యాంకింగ్‌ నిబంధనలకు అమలు చేయనందుకు యాక్సిస్‌ బ్యాంక్‌కు 5 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. 2017, 2018 మరియు 2019 సంవత్సరాలకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్ నిర్వహించిన లావాదేవీలు.. బ్యాంక్‌ ఖాతాలపై ఆర్బీఐ విచారణ చేయగా నిబంధనలు బ్యాంక్‌ ఉల్లంఘించినట్లు తేలింది. అలాగే తాజాగా గత ఏడాది 2020 జూన్‌ నెలలో కొన్ని అనుమానాస్పద లావాదేవీలపై యాక్సిస్‌ బ్యాంక్‌ నివేదిక సమర్పించింది. ఆ నివేదికలను పరిశీలించిన తరవాత కూడా యాక్సిస్‌ బ్యాంక్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆర్బీఐ విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ఆర్బీఐ తాము ఇచ్చిన నోటీసులకు బ్యాంకు నుండి అందిన సమాధానాలు, బ్యాంకు అధికారులు వ్యక్తిగతం ఇచ్చిన వివరణలు పరిగణనలోకి తీసుకుంది. ఈ నివేదికల ఆధారంగా 5 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.