IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్.. టీమిండియా తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ నవంబర్ 22 నుంచి తొలి టెస్ట్ ఆడనుంది. పెర్త్ వేదికగా జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు వెళ్లాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు అత్యంత కీలకం. దీంతో రెండు జట్లు కూడా సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్ కు ముందు భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. విదేశాల్లో కుర్రాళ్లతో మ్యాచ్ ఆడుతుండడంతో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన ప్లేయింగ్ 11 ను ప్రకటించాడు. 

రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం కావడంతో ఓపెనర్లుగా శుభమాన్ గిల్, యశస్వి జైశ్వాల్ ను ఎంపిక చేశాడు. రాహుల్ ను మూడో స్థానంలో.. కోహ్లీని నెంబర్ 4 లో సెలక్ట్ చేశాడు. రిషబ్ పంత్, ధృవ్ జురెల్ ను వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఛాన్స్ ఇచ్చాడు. సర్ఫరాజ్ కు కాదని ఇటీవలే ఆస్ట్రేలియాలో బాగా రాణించిన జురెల్ కు అవకాశం ఇవ్వడం విశేషం. స్పిన్ ఆల్ రౌండర్ ను ఎంచుకోవడంలో తడబడ్డాడు. జడేజా లేదా సుందర్ లో ఒకరు అని చెప్పుకొచ్చాడు. 

ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డిని తన జట్టులో చేర్చుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, ఆకాష్ దీప్, సిరాజ్ లను ఎంపిక చేశాడు. నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.  

రవిశాస్త్రి తుది జట్టు
 
శుభమన్ గిల్, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా/వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్