రజకులను అభివృద్ధిలోకి తేవాలి

  •     రిటైర్డ్ ప్రొఫెసర్​ కంచ ఐలయ్య

జనగామ అర్బన్, వెలుగు :  రజక కులస్తులు ఉతికిన బట్టలను లీడర్లు వేసుకుంటున్నారు.. కోఠి విమెన్స్​ కాలేజీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం చేశారు  కానీ.. వారి కష్టాలను అర్థం చేసుకోవట్లేదని రిటైర్డ్ -ప్రొఫెసర్ ​కంచ ఐలయ్య అన్నారు. రాబోయే రోజుల్లో చాకలి కులస్తులకు సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేస్తూ అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతానని ఆయన హామీ ఇచ్చారు. 

తెలంగాణ రజక రిజర్వేషన్​సమితి మూడో మహాసభ జనగామ టౌన్ లోని ఎన్ఎంఆర్ ​గార్డెన్స్​లో ఆదివారం నిర్వహించారు.  జనగామ జిల్లా అధ్యక్షుడు ఎదునూరి నరేష్​ అధ్యక్షతన జరగగా.. చీఫ్​ గెస్ట్​గా కంచ ఐలయ్య హాజరై మాట్లాడారు. రజక రిజర్వేషన్​ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ .. రాష్ట్రంలోని రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో  మున్సిపల్​ చైర్​పర్సన్​ పోకల జమున, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, డాక్టర్​ శ్రీనివాస్​ స్వామీజీతో పాటు 33 జిల్లాల కమిటీ సభ్యులు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులతో పాటు రజక కులస్తులు భారీగా పాల్గొన్నారు.