జల్ది కాంటాపెట్టకుంటే తిప్పలే

  • మొదలైన వరి కోతలు   
  • కేంద్రాలకు తరలివస్తున్న వడ్లు               
  • అకాల వర్షాలతో రైతుల ఆందోళన 

మెదక్​, వెలుగు: వానకాలం వరి కోతలు షురూ అయ్యాయి. చాలా మంది రైతులు హార్వెస్టర్లతో నూర్పిడి చేస్తుండడంతో త్వరగా దిగుబడి రైతుల చేతికందుతోంది. దీంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రదేశాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్ల వెంట ఆరబోశారు. కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సీజన్​లో జిల్లాలో 2.97 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. సన్నరకం వడ్లు 2,30,964 మెట్రిక్​ టన్నులు, దొడ్డు రకం 5,19,000 మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 

ఇందులో కొనుగోలు కేంద్రాలకు సన్నరకం 1,20 లక్షల మెట్రిక్​ టన్నులు, దొడ్డురకం 2.80  లక్షల మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 4 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం పీఏసీఎస్, ఐకేపీ, సివిల్​ సప్లై, ఎఫ్​ పీవోల ఆధ్వర్యంలో మొత్తం 484 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో సన్న ధాన్యం కోసం 93, దొడ్డు ధాన్యం కోసం 390 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

కోతలు మొదలైనా..

జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి. కొల్చారం మండల పరిధిలో  పోతంశెట్​పల్లి చౌరస్తా, అప్పాజిపల్లి వద్ద మెదక్, హైదరాబాద్​నేషనల్​ హైవే రోడ్డు పక్కన రైతులు వడ్లు ఆరబోశారు. కేంద్రాలకు ధాన్యం రాక మొదలైనప్పటికీ  జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం మొదలు కాలేదు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, అప్పాజిపల్లి వద్ద రోడ్డు పక్కన ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. 

నానిపోయిన వడ్లు ఎండబెట్టేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు. రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ చేసి వడ్లు కాంటా పెట్టాలని రైతులు కోరుతున్నారు. అలాగే అన్ని కేంద్రాలకు టార్ఫాలిన్​లను సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. 

నాలుగు రోజులైంది

మేం వానకాలం రెండెకరాల్లో వరి సాగు చేశాం. నాలుగు రోజుల కింద వరి కోసి వడ్లు తెచ్చి రోడ్డు పక్కన ఆరబోశాం. సోమవారం రాత్రి పడ్డ వానకు వడ్లు తడిసిపోయాయి. మళ్లీ మబ్బు పడుతోంది. వానొచ్చి వడ్లు తడుస్తాయని భయంగా ఉంది. జల్ది కొనుగోలు సెంటర్​ ఓపెన్​ చేసి వడ్లు కాంటాపెడితే మంచిగుంటది. - దుర్గయ్య, రైతు, అప్పాజిపల్లి