- ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా యాసంగిలో పెరుగనున్న వరి సాగు
- నారుమళ్లు, దుక్కులు సిద్ధం చేసిన అన్నదాతలు
- బోనస్‌తో సన్నాల వైపు మొగ్గు చూపుతున్న రైతులు
మహబూబాబాద్, వెలుగు: అన్నదాతలు యాసంగి సాగుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి వరంగల్జిల్లా వ్యాప్తంగా గతంలో కంటే ఎక్కువగా వరి పంట సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు ఇప్పటికే నారుమళ్లు వేయగా, దుక్కులు దున్నుకుని సిద్ధం చేస్తున్నారు.
మహబూబాబాద్జిల్లాలో చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండగా, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు వస్తుండడంతో రైతులు పనులు ముమ్మరం చేశారు. గత యాసంగితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరుగనున్నదని అధికారులు చెబుతున్నారు.
Also Read :- అటవీ శాఖలో ఇంటి దొంగలు!
సన్నాల వైపే రైతుల మొగ్గు..
యాసంగి సీజన్లో సన్న రకం వరి సాగు వైపే రైతులు మొగ్గుచూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్చెల్లిస్తుండడం ఇందుకు కారణం అని అన్నదాతలు చెబుతున్నారు. గతంలో యాసంగి సీజన్లో దొడ్డు వడ్లు ఎక్కువగా సాగు చేసే రైతులు ముందస్తుగా సన్న రకం వరి పంటను సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. నీటి వసతి సమృద్దిగా ఉండటంతో వానాకాలం వరి పంట కోసిన వెంటనే నారు మళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. కొంత మంది రైతులు నారు ఏపు దశకు రాక ముందే బురుద దుక్కులను సైతం సిద్ధం చేసుకుంటున్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్సౌకర్యంతోపాటుగా నీటి వనరులు ఉండటంతో సన్నాల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.
ఎరువుల కొరత లేకుండా చర్యలు..
యాసంగి సీజన్లో పంటల సాగు పెరుగనుండటంతో రైతులకు ఎరువుల కొరత లేకుండా ముందస్తుగా చర్యలను చేపడుతున్నాం. ఈసారి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగనున్నట్లు తెలుస్తోంది. రైతులు వరి నారు పోసే క్రమంలో అగ్రికల్చర్అధికారుల సలహాలు, సూచనలను పాటించాలి.
నాణ్యమైన పంట దిగుబడి కోసం రైతులు మేలు రకాలైన వరి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. వరి పంట విత్తనాలు కొనే సమయంలో బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. డిసెంబర్ చివరి వరకు జిల్లాలో వరి నాట్లు పుంజుకోనున్నాయి.- విజయ నిర్మల, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, మహబూబాబాద్
జిల్లా సాగు విస్తీర్ణం వరి మొక్కజొన్న ఇతర పంటలు
మహబూబాబాద్ 2,01,101 1,49,353 46,934 4814
వరంగల్ 2,33,950 1,05,500 1,03,500 700
హనుమకొండ 1,86,840 1,23,500 62,120 1,220
జనగామ 1,93,774 1,79,900 9,000 4,874
భూపాలపల్లి 1,03,074 83,859 18,582 633
ములుగు 62,350 55,000 5600 1,750