ఓఆర్ఆర్ టెండర్​పై సిట్..హరీశ్​రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నం

  • అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
  • పోయినేడాది ఎన్నికలకు ముందు ఓఆర్ఆర్​ను హడావుడిగా అమ్ముకున్నరు 
  • ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తరని తెలిసిబీఆర్ఎస్ వాళ్లు దేశం విడిచి పారిపోవాలని అనుకున్నరు
  • కొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రైవేట్ కంపెనీకి టెండర్ అప్పనంగా అప్పజెప్పారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ కంపెనీకి అప్ప జెప్పిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)  టెండర్​పై విచారణకు ఆదేశిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై ఎంక్వైరీ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షం, మాజీ మంత్రి హరీశ్​రావు కోరిక మేరకే ఓఆర్ఆర్​ టెండర్ కేటాయింపుపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. గురువారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి 
విక్రమార్క మాట్లాడుతూ.. తాము గత ప్రభుత్వం లెక్క ఓఆర్ఆర్​ను అమ్ముకోలేదని విమర్శించారు. 

దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు స్పందిస్తూ.. కాంగ్రెస్ ​ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే, ఓఆర్ఆర్​ టెండర్​ను రద్దు​చేయాలని కోరారు. అప్పుడు సభలోనే ఉన్న సీఎం రేవంత్​రెడ్డి వెంటనే లేచి.. సభ్యులందరి ఆమోదంతో, మంత్రివర్గ తీర్మానం మేరకు ఓఆర్ఆర్ టెండర్​పై సిట్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు.
పోయినేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ పెద్దలు ఓఆర్ఆర్​ను హడావిడిగా అమ్ముకున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘చాలా రోజుల నుంచి ఓఆర్ఆర్ పై చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు హడావిడిగా, సరైన విధివిధానాలు లేకుండా, టెండర్ ప్రక్రియను పాటించకుండా కొద్దిమందికి లబ్ధి చేకూర్చేందుకు ఓఆర్ఆర్ ను అప్పనంగా అప్పజెప్పారని తెలంగాణ సమాజమంతా చర్చించుకుంటున్నది. హైదరాబాద్​ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే క్రమంలో గతంలో మా ప్రభుత్వ హయాంలో రూ.6,500 కోట్ల అప్పు తెచ్చి ఓఆర్ఆర్ నిర్మించి.. వేల, లక్షల కోట్ల ఆస్తిని సృష్టించినం. 

తెచ్చిన అప్పును కూడా తీర్చేసి, ఓఆర్ఆర్​ను డెట్ ఫ్రీ చేసినం. కానీ దాన్ని పోయినేడాది ఎన్నికలకు ముందు హడావిడిగా అమ్ముకున్నరు. ప్రజలు ఓడించబోతున్నారని, ఎన్నికల్లో బొందపెట్టబోతున్నారని బీఆర్ఎస్ వాళ్లకు క్లియర్​గా తెలుసు. అందుకే దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతో ఓఆర్ఆర్​ను తెగనమ్ముకున్నరు. ఈయన (హరీశ్ రావు) ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మారు. ఓఆర్ఆర్ అమ్మకంపైనా విచారణ చేయాలని ఈరోజు హరీశ్ రావే డిమాండ్​ చేశారు. ఆయన కోరిక మేరకు ఎంక్వైరీ కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నాం. ఓఆర్ఆర్ టెండర్​ను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిన విధానంపై విచారణ జరిపేందుకు సభ్యులందరి ఆమోదంతో అనుమతివ్వాలని స్పీకర్​ను కోరుతున్న. విచారణకు సంబంధించిన విధివిధానాలు మంత్రివర్గంలో చర్చించి, కేబినెట్​తీర్మానం మేరకు ఓఆర్ఆర్​టెండర్​పై విచారణకు ఆదేశిస్తున్నం’’ అని ప్రకటించారు. 

విచారణను స్వాగతిస్తున్నం: హరీశ్ రావు 

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ‘‘నేను ఎక్కడా కూడా విచారణ చేయమని అడగలేదు. సీఎం కావాలనే మాట మార్చారు. బీఆర్ఎస్​మాదిరి ఓఆర్ఆర్​ను అమ్ముకోలేదని భట్టి పదే పదే అన్నారు. అందుకు మీకు ఇష్టం లేకపోతే టెండర్​రద్దు చేసి వాపస్​తీసుకోవాలని నేను అన్నాను. కానీ సీఎం విచారణకు ఆదేశించారు. దాన్ని మేం స్వాగతిస్తున్నాం. కానీ ముందు టెండర్​రద్దు చేసి ఎంక్వైరీకి ఆదేశించాలి” అని కోరారు.

ఇదీ ఓఆర్ఆర్​ టెండర్ ​కథ..  

ఓఆర్ఆర్​ను గత బీఆర్ఎస్​ప్రభుత్వం టీవోటీ బిడ్​లో ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. 2022 నవంబర్​లోనే టీవోటీ బిడ్​ను హెచ్ఎండీఏ పిలిచింది. అందులో ఐఆర్బీ ఇన్​ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ 30 ఏండ్ల లీజుకు మొత్తం రూ.7,380 కోట్లకు టెండర్ దక్కించుకున్నది. అయితే ఓఆర్ఆర్​టెండర్​వ్యవహారాన్ని గత ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ముగించింది. 

టెండర్ల నోటిఫికేషన్ దగ్గరి నుంచి, ఫైనలైజేషన్ వరకు అంతా రహస్యంగానే ఉంచింది. బేస్ ప్రైస్‌ ఎంత పెట్టారో కూడా చెప్పలేదు. ఇక టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ కంపెనీ తన షేర్స్‌ లో మేజర్​వాటాను సింగపూర్​కు చెందిన ఒక ఇన్వెస్ట్ మెంట్ కంపెనీకి అమ్ముకున్నది. దీంతో ఈ వ్యవహారం వెనుక భారీగా అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఎవరికో లబ్ధి చేసేందుకే వ్యవహారం నడిపినట్టు ప్రాథమికంగా గుర్తించింది.

చాలా రోజులుగా ఓఆర్ఆర్​పై చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్ ప్రక్రియను పాటించకుండా కొద్దిమందికి లబ్ధి చేకూర్చేందుకు ఓఆర్ఆర్ ను అప్పనంగా అప్పజెప్పారని తెలంగాణ సమాజమంతా చర్చించుకుంటున్నది. ప్రజలు ఓడించబోతున్నారని, ఎన్నికల్లో బొందపెట్టబోతున్నారని బీఆర్ఎస్ వాళ్లకు క్లియర్​గా తెలుసు. అందుకే దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతో ఓఆర్ఆర్​ను తెగనమ్ముకున్నరు. హరీశ్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మారు. ఓఆర్ఆర్ అమ్మకంపైనా విచారణ చేయాలని ఇప్పుడు హరీశ్ రావే డిమాండ్​ చేశారు. ఆయన కోరిక మేరకు ఎంక్వైరీ కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నాం.  సీఎం రేవంత్​రెడ్డి