నేడు జడ్చర్ల మున్సిపల్​ చైర్​పర్సన్​​ ఎన్నిక .. పోటీ పడుతున్న ముగ్గురు కౌన్సిలర్లు

జడ్చర్ల, వెలుగు: కొత్తగా ఏర్పాటైన మహబూబ్​నగర్​ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాల్టీలో మూడేళ్లు పూర్తి కాకముందే చైర్​ పర్సన్​పై అవిశ్వాసం ప్రవేశపెట్టారు. దీంతో కొత్త చైర్మన్​ ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్థానిక మున్సిపల్​ ఆఫీసులో  సోమవారం ఉదయం 11 గంటలకు చైర్​పర్సన్ ఎన్నిక జరగనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మహబూబ్​నగర్​ ఆర్డీవో నవీన్  నోటిఫికేషన్​ రిలీజ్​ చేశారు. మున్సిపల్​ కమిషనర్​ లక్ష్మారెడ్డి ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. చైర్​పర్సన్​ సీటు బీసీ మహిళకు రిజర్వ్​ అయింది. జడ్చర్ల మున్సిపాల్టీలో 27 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ కు 20  మంది, కాంగ్రెస్​కు ఆరుగురు, బీజేపీకి ఒక కౌన్సిలర్​ ఉన్నారు. 

 బీఆర్ఎస్​కు 20 మంది సభ్యుల బలం ఉన్నా.. సభ్యులు చేజారిపోవద్దనే ముందస్తు ప్లాన్​ చేసింది. క్యాంపు రాజకీయాలకు ఆ పార్టీ లీడర్లు తెరతీశారు. చైర్ పర్సన్ పదవి కోసం ఆ పార్టీలో ముగ్గురు పోటీ పడుతుండడంతో పార్టీ పెద్దలు అలర్ట్  అయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా తమ కౌన్సిలర్లను  తీర్థయాత్రల పేరుతో క్యాంప్​నకు తరలించారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బందిని నియమించారు. మహబూబ్​నగర్​ డీఎస్పీ వెంకటేశ్వర్లు స్థానిక పోలీసులకు పలు సూచనలు చేశారు.