సరిహద్దు వలసలు తగ్గిస్తం..వారికి మెరుగైన సౌలతులు కల్పిస్తాం

సరిహద్దు వలసలు తగ్గిస్తం..వారికి మెరుగైన సౌలతులు కల్పిస్తాం


ఈటానగర్​: సరిహద్దు ప్రజల వలసలను తగ్గిస్తామని, రాబోయే రెండేండ్లలో వారికి మెరుగైన సౌలతులు కల్పిస్తామని కేంద్ర మంత్రి నితీశ్​ ప్రామాణిక్​ చెప్పారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం వైబ్రెంట్​ విలేజ్​ ప్రోగ్రామ్​ (వీవీపీ)ని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ప్రధాని మోడీ వీవీపీని ప్రకటించారన్నారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా నిర్వహిస్తున్న నార్త్​ ఈస్ట్​ ఫెస్టివల్​ కోసం శనివారం ఆయన తొలిసారి అరుణాచల్​ ప్రదేశ్​ రాజధాని ఈటానగర్​కు వచ్చారు. వీవీపీలో భాగంగా పాత కార్యక్రమాలను కొనసాగిస్తూనే కొత్త కార్యక్రమాల కోసం అదనపు నిధులను కేటాయిస్తామని చెప్పారు. ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని, పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, రోడ్లు వేస్తామని, సోలార్​, విండ్​ పవర్​ వంటి పునరుత్పాదక విద్యుత్​ను అందిస్తామని ఆయన చెప్పారు. దూరదర్శన్​ డీటీహెచ్​ సేవలతో పాటు ఎడ్యుకేషన్​ చానెళ్ల ప్రసారాలను అందిస్తామని, బతుకుదెరువు కోసం మద్దతునిస్తామని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడంతో పాటు సరిహద్దు భద్రతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేశంలోని వేరే ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానిస్తున్నామన్నారు. భవిష్యత్​లో ఈశాన్య రాష్ట్రాల రూపు రేఖలు మారిపోతాయని, రెండేండ్లలో అరుణాచల్​ప్రదేశ్​ కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధిస్తుందని ప్రామాణిక్​ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అవసరాలను బట్టి వీవీపీని అమలు చేస్తామని వివరించారు. దేశంలోని 200 గిరిజన తెగల అభివృద్ధికి 
కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు.