SL vs NZ 2024: రచిన్ రవీంద్ర ఒంటరి పోరాటం.. రసవత్తరంగా న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్

గాలే వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కివీస్ గెలవాలంటే మరో 68 పరుగులు కావాలి. మరోవైపు శ్రీలంక గెలవాలంటే చివరి రోజు రెండు వికెట్లు తీయాలి. ఈ నేపథ్యంలో ఈ టెస్ట్ శ్రీలంక గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రీజ్ లో రచీన్ రవీంద్ర (91) ఉండడంతో కివీస్ ఈ యువ క్రికెటర్ పైనే ఆశలు పెట్టుకుంది.  

275 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. రచీన్ రవీంద్ర హాఫ్ సెంచరీ (91) ఒక ఎండ్ లో ఒంటరి పోరాటం చేస్తూ కివీస్ ఆశలు సజీవంగా ఉంచాడు. విలియంసన్ (30) వికెట్ కీపర్ బ్లండర్ (30) టామ్ లేతమ్ (28) పర్వాలేదనిపించారు. కాన్వే (4) , మిచెల్ (8) , ఫిలిప్స్ (4) విఫలమయ్యారు. 196 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి లక్ష్యం వైపుగా దూసుకెళ్తున్నా.. ఆట చివర్లో రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ లంక వైపు మొగ్గింది.

శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండీస్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. అసిత ఫెర్నాండో ధనంజయ్ డిసిల్వా చెరో వికెట్ తీసుకున్నారు. ఈ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 305 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 340 పరుగులు చేసి 35 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 309 పరుగులకు ఆలౌటైంది. 275 పరుగుల లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్ ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రచీన్ రవీంద్ర (91), అజాజ్ పటేల్ (0) క్రీజ్ లో ఉన్నారు.