డిసెంబర్​ 31పై ఫోకస్..!

  • ఏవోబీ నుంచి ఓరుగల్లుకు విచ్చలవిడిగా సప్లై అవుతున్న గంజాయి
  • ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కోసం గుట్టుగా రవాణా
  • గ్రేటర్ సిటీతోపాటు గ్రామాల్లోనూ విక్రయాలు
  • సప్లయర్స్ పై నజర్ పెట్టిన పోలీసులు

హనుమకొండ, వెలుగు: ఇంకో వారం రోజుల్లో న్యూ ఇయర్​ రాబోతోంది. డిసెంబర్​ 31 ఇయర్​ ఎండింగ్​ను కొంతమంది లిక్కర్​పార్టీలతో సెలబ్రేట్​ చేసుకునేందుకు ప్లాన్ చేస్తుండగా, ఇంకొందరు గంజాయి కిక్కులో న్యూ ఇయర్​కు వెల్​కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఏటికేడు డిమాండ్​ కు పెరుగుతుండటంతో కొంతమంది స్మగ్లర్లు గంజాయిని ఆంధ్రా-ఒడిశా బార్డర్​ నుంచి గుట్టుగా ఓరుగల్లుకు చేరవేస్తున్నారు. ఇక్కడి నుంచి మారుమూల ప్రాంతాలకు కూడా చేరేలా నెట్​వర్క్​ మెయింటైన్​చేస్తున్నారు. 

ఈసారి న్యూ ఇయర్ కు ఎఫెక్ట్​ ఉండకుండా వరంగల్ పోలీసులు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. యాంటీ నార్కొటిక్​ బ్యూరో, లా అండ్ ఆర్డర్, టాస్క్​ ఫోర్స్, తదితర వింగ్​లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి గ్యాంగులపై నజర్​పెట్టారు. గాంజా హాట్​స్పాట్లు, అడ్డాలపై ఫోకస్ పెట్టి, యూజర్స్​, సప్లయర్స్​పై కేసులు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. 

ఏవోబీ నుంచే ఇక్కడికి..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదివరకు గాంజా కల్టివేషన్​బాగానే జరిగేది. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు కూడా ఎక్స్​పోర్టయ్యేది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడా పరిస్థితి లేదు. కొంతమంది ఆంధ్రా-, ఒడిశా బార్డర్​ నుంచి ఇక్కడికి గంజాయి స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టారు.

 అక్కడి మారుమూల ప్రాంతాల్లో సాగయ్యే గంజాయిని వరంగల్ మీదుగా హైదరాబాద్​తోపాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. యూత్​కు గంజాయి అలవాటు చేయడమే కాకుండా కొంతమందిని సప్లయర్స్​గా మారుస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ మహమ్మారి ఊళ్లకు కూడా పాకింది.  కాగా, ఏవోబీ నుంచి గాంజాను తీసుకొస్తున్న గ్యాంగులు యూత్​తోపాటు స్కూల్​ పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాయి. నగరంలోని కొన్ని ఎడ్యుకేషనల్​ ఇన్​ స్టిట్యూషన్స్, హాస్టల్స్​ గంజాయికి అడ్డాగా మారాయనే ఆరోపణలున్నాయి.

యూజర్స్​, సప్లయర్స్​పై నజర్​​

డిసెంబర్ 31 వచ్చిందంటే పార్టీల్లో గంజాయి మత్తు కామనైపోతోంది. ఇదే విషయం పోలీస్​ ఆఫీసర్ల దృష్టిలో కూడా ఉంది. దీంతో ఈసారి న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​లో గంజాయికి తావులేకుండా పక్కా ప్లాన్​ వేస్తున్నారు. తెలంగాణ యాంటీ నార్కొటిక్​ బ్యూరోతోపాటు లా అండ్​ఆర్డర్, టాస్క్​ఫోర్స్​ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 150కి పైగా కేసులు నమోదు చేసి, 3.5 కోట్లకుపైగా విలువైన గంజాయిని సీజ్​చేశారు. ఆదివారం హసన్​పర్తి మండలం మల్లారెడ్డిపల్లి శివారులో కొత్తూరు కిషన్​ అనే వ్యక్తి తన పొలంలోని పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు ఆఫీసర్లు తనిఖీలు చేపట్టి గంజాయిని పట్టుకుంటున్నా, సరఫరా మాత్రం ఆగడం లేదు. దీంతో న్యూ ఇయర్​ నేపథ్యంలో స్పెషల్​ రైడ్స్​ చేపట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. 

హాట్​స్పాట్లపై నిఘా..​

వరంగల్ నగరంలో చాలా గంజాయి హాట్​స్పాట్లు ఉన్నాయి. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు, క్వార్టర్లు, హనుమకొండ, వరంగల్ బస్టాండ్​ ఏరియాలతోపాటు రింగ్​ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాలు, మడికొండ ఇండస్ట్రియల్​ ఏరియా, ఖిలా వరంగల్, ఎర్రగట్టుగుట్ట, అనంతసాగర్, గోపాలపూర్, కోమటిపల్లి తదితర శివారు ప్రాంతాల్లో గంజాయి హాట్​స్పాట్లను ఆఫీసర్లు గతంలో గుర్తించారు. ఇలాంటి ఏరియాలపై నిఘా పెట్టేందుకు యాంటీ నార్కొటిక్​ బ్యూరో ఆధ్వర్యంలో మూడు స్పెషల్​ టీమ్​లు ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తుండగా, న్యూ ఇయర్​ నేపథ్యంలో లా అండ్​ ఆర్డర్​, టాస్క్​ ఫోర్స్​ సిబ్బంది కూడా స్పెషల్​ ఫోకస్​ పెట్టారు.  

ప్రత్యేక బృందాలతో తనిఖీలు

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ నార్కొటిక్​ బ్యూరో ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి ఇప్పటివరకు మొత్తంగా 1,150 కిలోల గంజాయి పట్టుకుని, 33 కేసులు నమోదు చేశాం. న్యూ ఇయర్​ నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. గంజాయి సప్లయర్స్, స్మోకర్స్​ఆటకట్టిస్తాం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.- కె.సైదులు, డీఎస్పీ, యాంటీ నార్కోటిక్​ బ్యూరో, వరంగల్