- సిద్ధూతోపాటు నలుగురు వర్కింగ్ ప్రసిడెంట్లు
న్యూఢిల్లీ: పంజాబ్ పీసీసీ చీఫ్ ఎంపికపై ఉత్కంఠకు.. ఊహాగానాలకు ఎట్టకేలకు తెరదించింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ పీసీసీగా సారథిగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆయనతో పాటు నలుగురుని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. సంగత్ సింగ్ గిజియాన్, సుఖ్విందర్ సింగ్ డానీ, పవన్ గోయెల్, కుల్జిత్ సింగ్ నగ్రాలకు వర్కింగ్ ప్రసిడెంట్లుగా ఎంపిక చేశారు. సిద్ధూ ఎంపిక కోసం అధిష్టానం చేసిన కసరత్తు.. జాప్యం పలురకాల ఊహాగానాలకు తావిచ్చింది. పలుమార్లు సిద్ధూతో సమావేశమై చర్చించిన ప్రతిసారి సీఎం అమరీందర్ సింగ్.. ఆయన సహచర ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకమాండ్ ను ఆశ్రయించడంతో ఒక దశలో సిద్ధూ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఆప్ వంచన చేరే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే రాహుల్, ప్రియాంక, సోనియాలు సిద్దూను బుజ్జగించి గురుతర బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. సీఎం అమరీందర్ ఆయన ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తుండడంతో వారిని బుజ్జగించేందుకు మరికొందరు సీనియర్లను రంగంలోకి దించి.. ఎట్టకేలకు ఆదివారం రాత్రి నియామకాన్ని ఖరారు చేశారు. ఏఐసీసీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
