విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోరా..?

విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోరా..?
  • తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
  • విద్యార్థుల ఆత్మహత్యల కట్టడి కోసం ఏం చేస్తున్నారో ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయ చర్యలు తీసుకోకపోవడం పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయమైన చర్యలు తీసుకుని ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని గతంలో ఆదేశాలిచ్చినా పట్టించుకోరా అంటూ కమీషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యల పై నివేదిక ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్లో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కమిషన్ కు నివేదిక సమర్పించకపోవడంతో కమిషన్ తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న చర్యలపై ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని ఇరు రాష్ట్రల అధికారులను ఆదేశించింది. విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తీసుకున్న చర్యలపై నివేదిక అందించకపోతే తమ ముందు హాజరు కావాల్సి వస్తుందని ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలను హెచ్చరించింది. 
తెలంగాణలో 2019 జాతీయ క్రైం రికార్డుల ప్రకారం 426 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తు చేసింది. తెలంగాణలో ఒకే వారంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం సాధారణ విషయం కాదని, చాలా బాధకరమైన విషయమని కమిషన్ పేర్కొంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలు సరిపోవని కమిషన్ అభిప్రాయపడింది.  
ఏపీలో ప్రభుత్వ క్రైం రికార్డుల ఆధారంగా 383 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని కమిషన్ తెలియజేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ ఫిర్యాదుతో జాతీయ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది.