నవాబుపేట, వెలుగు: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. గురువారం నవాబుపేట మండల కేంద్రంలో నిర్వహించిన బాలాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా హరలింగం, వైస్ చైర్మన్ గా తులసీరాం నాయక్ తో పాటు మరో 14 మంది డైరెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తోందన్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిన రుణమాఫీ వారు తీసుకున్న వ్యవసాయ రుణాల వడ్డీలకే సరిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలోని 31,544 మంది రైతులకు మొత్తంగా రూ.250 కోట్ల వరకు రుణమాఫీ జరిగిందన్నారు.
కొల్లూరును మండల కేంద్రం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానని, అందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్ల కోసం రూ.153 కోట్ల నిధులు తీసుకొచ్చానని చెప్పారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగారావు, ఖాజా మహేఖ్, ఎన్ పీ వెంకటేశ్, భూపాల్ రెడ్డి, హమీద్ మహేఖ్, జహీర్ అక్తార్, దుశ్వంత్ రెడ్డి, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.